విజయనగరం ఫోర్ట్: పీఏసీఎస్ (ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు)ల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.కామేశ్వరావు అన్నారు. స్థానిక సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2025 డిసెంబర్ 6 నుంచి 80 రోజుల పాటు నిర్వహించిన ఆందోళన సందర్భంగా పీఆర్‌సీలు, గ్రాట్యూటీ, ఇన్సురెన్స్ వంటి అంశాలపై హామీలు ఇచ్చినా.. తర్వాత జారీ చేసిన జీఓలు 112, 322 ద్వారా ప్రభు త్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. మోసపూరిత జీఓలు ద్వారా ఉద్యోగులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రానున్న కాలంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. సమావే శంలో ఏఐటీయూసీ నాయకులు రంగరాజు, రెడ్డి సత్యారావు, బెల్లాన రామునాయుడు, డి. నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్: స్థానిక పూల్‌బాగ్ లక్ష్మీగణపతి కాలనీలో వెలిసిన శ్రీ మరిడిమాంబ అమ్మవారి చల్లదనం మహోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజామునుంచే అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సుమారు మూడు శతాబ్దాల నుంచి కొలువై ఉన్న మరిడిమాంబ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతోందని ఆలయ ప్రాజెక్ట్ చైర్మన్ సముద్రాల నాగరాజు పేర్కొన్నారు. ఆలయ ధర్మకర్త కర్రి వెంకటరమణ సిద్దాంతి ఆధ్వర్యంలో అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. సాంప్రదాయ జముకుల కళాకారులు అమ్మవారి చరిత్రను గానం చేస్తూ, నృత్యాలు చేస్తూ సాగిన ఊరేగింపు విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ కమిటీ అధ్యక్షులు బేతా కృష్ణారా వు, బెహరా కూర్మారావు, దువ్వు శ్రీనివాసరా వు, ఎస్.అచ్చిరెడ్డి, పైడిరాజు పర్యవేక్షించారు. వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.
విజయనగరం ఫోర్ట్: హెచ్‌ఐవీతో జీవించే వారి పట్ల ఆదరణ భావం కల్గి ఉండాలని డీఎంహెచ్ ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. అంతర్జాతీ య ఎయిడ్స్ కొవ్వొత్తుల సంస్మరణ దినం సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద ఆదివారం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి డీఎంహెచ్‌ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ రోగుల పట్ల వివక్ష చూపకూడదన్నారు. అందరితో సమానంగా రాజ్యాంగం పొందుపరిచిన పౌర హక్కులు అన్ని పొందేటట్టు చూడాలన్నారు. హెచ్‌ఐవీ వచ్చే అన్ని మార్గాలను ఆపి వేయాలన్నారు. హెచ్‌ఐవీ ఎయిడ్స్ పట్ల అవగాహన కల్గి ఉండా లన్నారు. హెచ్‌ఐవీ రోగులు క్రమం తప్ప కుండా మందులు వాడాలని, దీని వల్ల ఆరోగ్యంగా జీవిస్తారని తెలిపారు. డీఎల్‌ఓ డాక్టర్ కె.రాణి, డీపీఎం ఉమామహేశ్వరావు పాల్గొన్నారు.
జియ్యమ్మవలస రూరల్: చినకుదమ, కుందరతిరువాడ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో రైతులు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు ఇటీవల పెదబుడ్డిడి, చినబుడ్డిడి ప్రాంతాల్లో పంట ధ్వంసం చేసిన ఏనుగులు ఆదివారం ఇటువైపు రావడంతో రైతులు, ప్రయాణికులు భీతిల్లుతున్నారు.


