భూములిచ్చిన రైతులపైకి బుల్డోజర్లా... | - | Sakshi
Sakshi News home page

భూములిచ్చిన రైతులపైకి బుల్డోజర్లా...

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

భూములిచ్చిన రైతులపైకి బుల్డోజర్లా... ● చంద్రబాబు మార్కు పాలనకు నిదర్శనం ● ప్రభుత్వ తీరు దుర్మార్గం ● సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ

● చంద్రబాబు మార్కు పాలనకు నిదర్శనం ● ప్రభుత్వ తీరు దుర్మార్గం ● సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ

పూసపాటిరేగ : భోగాపురం గ్రీన్‌ఫీల్డు అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులను బుల్డోజర్‌తో నెట్టి వేయడం దుర్మార్గం అని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నా రు. భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో బాధిత కుటుంబాలను ఆదివారం ఆయన కలిశారు. గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబాలకు అండగా వుంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ భోగాపురం గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అనేక మంది రైతులు భూములు ఇచ్చారన్నారు. అయితే బైరెడ్డిపాలెంలో అప్రోచ్‌ రోడ్‌ కోసం భూములు ఇచ్చిన 20 కుటుంబాలకు రెండేళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం కాకుండా తక్కువ రేటుతో బ్యాంకులో పరిహారం జమ చేస్తామని రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆ భూమి తప్పా ఎటువంటి ఆధారం లేని కుటుంబాల పట్ల ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. నిరసన తెలుపుతున్న బాధిత కుటుంబాలపై అధికారులు వ్యవహరించిన తీరు సరైంది కాదన్నారు. బాధితులపైకి జేసీబీ, బుల్డోజర్లు ఎక్కించడానికి ప్రయత్నించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న ఆస్తిని అబివృద్ధి కోసం త్యాగం చేస్తే పోలీసులతో బెదిరించడం అన్యాయం అన్నారు. ఎయిర్‌పోర్టులో బడాబాబులకు అనుకూలంగానే భూసేకరణ జరగడంతో లాభపడి నిరుపేదలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో ఓట్లు వేయించుకొని ఇప్పుడు బాధితులను నడిరోడ్డుపై వదిలేసిన స్థానిక నాయకుల తీరును ఆక్షేపించారు. కోర్టులు పేరుతో సాగదీయకుండా పెద్దల సమక్షంలో ఒప్పుకున్న ప్రకారం ఎకరాకు రూ.80 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే బాధితుల తరఫున పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు టీవీ రమణ, పార్టీ మండల బాధ్యులు బచ్చల సూర్యనారాయణ, బైరెడ్డిపాలెం బాధిత రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement