పైనాపిల్‌ సీజన్‌ ఆరంభం | - | Sakshi
Sakshi News home page

పైనాపిల్‌ సీజన్‌ ఆరంభం

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

పైనాపిల్‌ సీజన్‌ ఆరంభం

సీతంపేట: గిరిజన రైతులకు ప్రధాన జీవనాధారమైన పైనాపిల్‌ సీజన్‌ ఆరంభమైంది. సీతంపేట మన్యంలో అత్యధికంగా ఈనెల నుంచి ఆగస్టు వరకు దిగుబడి అవుతుంది. 7,300 ఎకరాల్లో పంట విస్తరించి ఉంది. దాదాపు 41 వేల టన్నుల పైనాపిల్‌ దిగుబడి వస్తుంది. ప్రస్తుతం రూ.15 నుంచి 18మధ్య ఒక్కో పండు ధర పలుకుతోంది. వారపు సంతలకు గిరిజనులు పైనాపిల్‌ పంటను తీసుకువస్తున్నారు. గతేడాది సీజన్‌ ఆరంభంలో రూ.20 ధర పలికి సీజన్‌ ముగిసే నాటికి రూ.5కు పడిపోయింది. దీంతో గిరిజనులు అవస్థలు పడ్డారు. ఏజెన్సీలో కొండపోడు వ్యవసాయంలో బాగంగా మిశ్రమ పండ్ల తోటల్లో ఈ పంట అంతరపంటగా సాగు చేస్తున్నారు. కోడిశ, కుశిమి, ముత్యాలు, శంభాం, అక్కన్నగూడ, రాజన్నగూడ, జోగైనాయుడుగూడ, కోడిశ. తొత్తడి, రామానగరం, అంటికొండ,పొల్ల, దోనుబాయి, మానాపురం తదితర గిరిజన గ్రామాల్లో విస్తారంగా పైనాపిల్‌ తోటలను వేశారు. ఈ తోటల పెంపకానికి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు అవసరం లేకపోవడంతో గిరిజనుల్లో ఈ పంటపై నానాటికీ ఆసక్తి పెరుగుతోంది. సీజన్‌లో గిరిజనులకు మంచి ఆదాయం వస్తుంది. మైదాన ప్రాంతాలకు చెందిన వ్యాపారులకు గిరిజనులు విక్రయిస్తారు. దళారీ వ్యాపారులు సంతలకు వచ్చి పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తారు. ఇక్కడ కొనుగోలు చేసిన పైనాపిల్‌కు ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్‌, విశాఖపట్నం, గుంటూరు, పల్నాడు, ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మంచి డిమాండ్‌ ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేసి లారీలు, వ్యాన్‌లలో తరలించుకుపోయి వ్యాపారులు అధిక లాభాలు ఆర్జిస్తారు. ఒక్కో పండుపై కనీసం రూ.10 నుంచి 15 వరకు లాభాలు వస్తాయని వ్యాపారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో వ్యాపారులు సిండికేట్‌ మారి ధరలు తగ్గించడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. వారపు సంతలకు తెచ్చిన పైనాపిల్‌ ఏమాత్రం నాణ్యత లోపించినా కొనుగోలు చేయరని గిరిజనులు తెలిపారు. సీతంపేటలో సోమవారం, మర్రిపాడులో బుధవారం, గురువారం దోనుబాయి, శనివారం పొల్ల, కుశిమిలలో వారపు సంతలు జరుగుతాయి. ఇక్కడకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో సీజన్‌ ఆరంభంలో గిరిజనులకు ముందు అడ్వాన్సులు ఇచ్చి పంటలను స్వాధీనం చేసుకోవడంతో ఇతరులెవరీకీ విక్రయించడానికి అవకాశముండదని గిరిజనులు తెలిపారు.

గతంలో ఇలా...

ఐటీడీఏ చొరవతో రెండేళ్ల కిందట ఇతర జిల్లాల్లో 41రైతు బజార్లలో వీటిని రైతు సంఘాల గ్రూపుల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. మధ్య దళారీ వ్యవస్థను రూపుమాపి గిరిజనులకు ఆదాయం వచ్చే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఎఫ్‌పీవోల ద్వారా రైతులను నుంచి గ్రేడ్‌ ను బట్టి రూ.15కు తక్కువ లేకుండా కొనుగోలు చేశారు. ఐటీడీఏ, ఉద్యానవనశాఖ, వెలుగు వంటి శాఖలు పైనాపిల్‌కు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు.

7,300 ఎకరాల్లో సీతంపేట ఏజెన్సీలో విస్తరించి ఉన్న పంట

41వేల టన్నుల దిగుబడి

నాణ్యతను బట్టి రూ.15–18మధ్య

పలుకుతున్న ఒక్కో పండు

పట్టణ ప్రాంతాల్లో రూ.40 వరకు విక్రయం

ఏటా సీజన్‌ ఆఖరులో రూ.5కు

పడిపోతున్న పండు ధర

ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు తరలుతున్న పంట

గిరిజన రైతుల ప్రధాన ఆదాయవనరు

పైనాపిల్‌ రైతులను ఆదుకోవాలి

పైనాపిల్‌ రైతులను మద్దతు ధర కల్పించి ఆదుకోవాలి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో ఇక్కడే ఎక్కువ పంట దిగుబడి వస్తుంది. ఈ పంటే జీవనాధారమై బతుకుతున్న గిరిజనులు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో నేరుగా ఐటీడీఏ ద్వారా పైనాపిల్‌ కొనుగోలు చేయించి మార్కెటింగ్‌ చేయించాం. దీంతో గిరిజనుల ఆదాయ వనరులు మెరుగయ్యాయి. విశ్వాసరాయి కళావతి, మాజీ ఎమ్మెల్యే, పాలకొండ

మార్కెటింగ్‌కు చర్యలు:

పైనాపిల్‌కు సంబంధించి గిరిజనులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు గిరిజన రైతులతో గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలిస్తున్నాం. మారిషస్‌ అనే పైనాపిల్‌ వైరెటీని గతేడాది 70 ఎకరాల్లో వేయించాం. ఈ సంవత్సరం 500 ఎకరాల్లో విస్తరింప చేయడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఎస్‌.వి.గణేష్‌, పీహెచ్‌వో, సీతంపేట ఐటీడీఏ

పంట దిగుబడి బాగుంది

ఈ సంవత్సరం కూడా పైనాపిల్‌ పంట మంచి దిగుబడి వచ్చింది. ధరలే వారం, వారం తగ్గుముఖం పడుతున్నాయి. ధరల్లో నిలకడ ఉండడం లేదు. కష్టానికి తగ్గ ఫలితం లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు గ్రామాలకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఎస్‌.రమేష్‌, ముత్యాలు

Advertisement
 
Advertisement
Advertisement