విజయనగరం టౌన్: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయనగరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా సముద్రాల గిరిజా ప్రసన్న ఎంపికయ్యారు. గతంలో వాసవీ క్లబ్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా, విజయనగరం కంటోన్మెంట్ ఆర్యవైశ్య సేవా సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఆమె సేవలందించారు. 23 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ గతేడాది రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇనిస్పిరేషన్ అవార్డ్ తీసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఉత్తమ మహిళా పురస్కారాన్ని స్వీకరించారు. గతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిసెస్ విజయనగరం పోటీల్లో విజేతగా ఆమె నిలిచారు.
బేత లల్లూపై పీడీ యాక్ట్
విజయనగరం క్రైమ్: చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, భౌతిక దాడులకు పాల్పడుతూ, పలు కేసుల్లో నిందితుడిగా అరెస్టయిన విజయనగరంలోని శివాలయం వీధికి చెందిన బేత లల్లూ (23)పై పీడీ యాక్ట్ నమోదు చేసి అరెస్ట్ చేసి విశాఖ కేంద్ర కారాగారానికి తరలించామని ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదివారం తెలిపారు. నగరంలోని శివాలయంవీధికి చెందిన బేత లల్లూ 2023 నుంచి నేరాలకు పాల్పడుతున్నాడని 2 గంజాయి అక్రమ రవాణా కేసులు, 3 దొంగతనాల కేసులు, ఒక చైన్ స్నాచింగ్‌కు పాల్పడి నిందితుడిగా అరెస్టు అయ్యాడన్నారు. లల్లూపై పీడీ యాక్ట్ అమలు చేయాలని కోరుతూ విజయనగరం వన్ టౌన్ పోలీసులు డీపీఓకు ప్రతిపాదనలు పంపగా, వాటిని సిఫార్సు చేస్తూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అదేశాలతో నిందితుడు బేత లల్లూను అరెస్ట్ చేసి జైలుకు తరలించామని ఎస్పీ వివరించారు.
8మంది జూదరుల అరెస్టు
బలిజిపేట: మండలంలోని గౌరీపురం దాటిన తరువాత మామిడి తోటలో జూదం ఆడుతున్న 8మందిని పట్టుకున్నట్లు ఎస్సై సింహాచలం తెలిపారు. ఈ మేరకు ఆయన తెలిపిన వివరాల ప్రకారం గౌరీపురం గ్రామం దాటిన తరువాత ఉన్న మామిడి తోటలో జూదం ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడిచేశారు. ఈ సందర్భంగా వారి దగ్గర నుంచి రూ.22,500లు స్వాధీనం చేసుకున్నారు. జూదరులు వీరఘట్టం, వంగర తదితర ప్రాంతాలకు చెందిన వారని, వారిపై కేసు నమోదుచేసినట్లు ఎస్సై తెలిపారు.
నాయీ బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
విజయనగరం టౌన్: జిల్లాలోని నిరుపేద నాయీబ్రాహ్మణ కుటుంబాలకు చెందిన 500 మార్కులు పైబడి పదోతరగతిలో మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. నాయీబ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు సత్కారంతో పాటు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ అరవింద్ మాట్లాడుతూ చదువుతోనే విజ్ఞానం, అభివృద్ధి జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ జీవితాలను మార్చుకోవాలంటే ఉన్నత విద్యనభ్యసించి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పెదపెంకి శివ ప్రసాద్, వెంకట పద్మనాభం, పడాల రమణ, అప్పారావు, టీవీ దుర్గారావు, దిమిలి పైడిరాజు, షణ్ముఖరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దిమ్మిడిజోల సమీపంలోకి ఏనుగులు
భామిని: తినడానికి తిండి, తాగడానికి నీరు లేక అలమటిస్తున్న ఏనుగుల గుంపు విచ్చల విడిగా తిరుగాడుతున్నాయి. ఆదివారం భామిని మండలం దిమ్మిడిజోల సమీపంలోకి నాలుగు ఏనుగుల గుంపు వచ్చి కళ్లాల్లోని చేల కుప్పలు పాడుచేశాయి. అనూహ్యంగా దిమ్మిడిజోల గ్రామ సమీపంలోకి ఏనుగుల గుంపు రావడంతో గ్రామస్తులు చూడడానికి పరుగులు పెట్టారు. వేసవి తీవ్రతకు అల్లాడుతున్న ఏనుగుల గుంపు ప్రజలను చూసినా ఏమీ అనకుండా చేను మేయడంలో తలమునకలయ్యాయి.


