గుర్ల: మండలంలో చైన్‌స్నాచింగ్ జరగడంతో ప్రజలు అందోళన చెందుతున్నారు. గరివిడి మండలంలోని కె. పాలవలసకు చెందిన గొర్లె సుజాత గుర్ల మండలంలోని కెల్ల గ్రామంలో ఉంటున్న తల్లి అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో తల్లి బాగోగులు చూడడానికి సుజాత ఆస్పత్రికి వెళ్లింది. ఆస్పత్రి నుంచి కె.పాలవలసలోని తమ స్వగృహనికి శనివారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సుజాత మెడలో ఉన్న బంగారు అభరణాలను చూసి విజయనగరం నుంచే ద్విచక్ర వాహనంపై వెంబడిస్తున్న ఇద్దరు వ్యక్తులు గుర్ల సమీపంలోని శివాలయం వద్ద చేరుకోగానే మెడలో నుంచి సుమారు రెండుంపావు తులాల బంగారం చైన్‌ను తెంపి వెళ్లిపోయారు. దుండగులు తెల్లని ఎన్‌ఎస్4 ద్విచక్రం వాహనంపై వచ్చి మాస్కులు ధరించి ఉన్నట్లు బాధితరాలు చెబుతోంది. బంగారు అభరణాలు అపహరించడంతో గుర్ల పోలీసులకు బాఽధితురాలు ఆదివారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై పి.నారాయణరావు తెలిపారు. బంగారు అభరణాలను అపహరించిన వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. నిందితుల వివరాలు ఎవరికై నా తెలిస్తే గుర్ల పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.


