దిగుబడి తగ్గింది
గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి పంట దిగుబడి తగ్గిపోయింది. నేను నాలుగు ఎకరాలు మామిడి తోటలను కౌలుకు చేస్తున్నాను. గత ఏడాది ఎకరానికి మూడు టన్నులు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది ఎకరానికి టన్నున్నర మాత్రమే దిగుబడి వచ్చింది. టన్ను ధర నెల రోజుల క్రితం బంగినిపల్లి రూ.50 వేలు ఉంటే ప్రస్తుతం రూ.20 వేలు తగ్గిపోయింది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – గౌరునాయుడు,
మామిడి రైతు,
విజయనగరం మండలం
విజయనగరం ఫోర్ట్:
మామిడి రైతులకు కష్టాలు వీడడం లేదు. ఈ ఏడాది ప్రారంభం నుంచే మామిడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. మామిడి పూత ఆశాజనకంగా వచ్చినప్పటకీ మంచు ప్రభావంతో నల్లగా మాడిపోవడంతో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో మామిడి రైతులు ఈ ఏడాది పంటపై సగం ఆశలు వదులుకున్నారు. అక్కడక్కడ మిగిలి ఉన్న పూత వల్ల వచ్చిన మామిడికి కూడా ధరలు తగ్గిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒక ఏడాది ధర రాక ఇబ్బంది పడితే మరో ఏడాది దిగుబడి తగ్గిపోయి ఇలా ప్రతీ ఏటా ఏదో ఒక సమస్యతో మామిడి రైతులు నష్టాల బారిన పడుతున్నారు. ఇంకోవైపు మామిడి వ్యాపారులు సిండికేట్‌గా మారడం వల్లే ధరలు తగ్గిపోయినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుకు మద్దతు ధర దక్కేలా చూడాల్సిన మార్కెటింగ్ శాఖ మామిడి పంట ఉద్యానశాఖ పరిధిలోకి వస్తుంది మాకేం సంబంధం అన్నట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇరు శాఖల సమన్వయ లోపం మామిడి రైతుల పాలిట శాపంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
● జిల్లాలో 32 వేల హెక్టార్లలో సాగు
జిల్లాలో ఉద్యాన పంటల్లో అధికంగా సాగయ్యేది మామిడి పంటే. అంతేకాకుండా విజయనగరం జిల్లా నుంచే మామిడి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి ఎక్కువగా అవుతుంది. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబయి, కోల్‌కత్తా, ఢిల్లీ వంటి ప్రాంతాలకు ఇక్కడ నుంచే మామిడి పంటను ఎగుమతి చేస్తారు. జిల్లాలో 32 వేల హెక్టార్ల వరకు మామిడి పంట సాగైంది.
● సీజన్ ఆరంభంలో మంచి ధరే..
సీజన్ ఆరంభంలో మామిడికి మంచి ధర పలికింది. ఇప్పుడు ఒక్కసారిగా ధర సగం వరకు తగ్గిపోయింది. మామిడి కొనుగోలు చేసే వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే ధరలు తగ్గిపోవడానికి కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో మామిడి టన్ను ధర రూ.60 వేలు వరకు ఉంటే.. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ.30 వేలుకు తగ్గిపోయింది. బంగినిపల్లి టన్ను ధర రూ.50 వేలు ఉంటే ప్రస్తుతం రూ.20 వేలకు పడిపోయింది. సువర్ణ రేఖ రకం మామిడి టన్ను ధర రూ.60 వేల నుంచి ప్రస్తుతం రూ.30 వేలకు తగ్గిపోయింది. తోతాపూరి మామిడి రకం టన్ను ధర రూ.30 వేల నుంచి రూ.10 వేలకు తగ్గిపోయింది. పరియాలు టన్ను ధర రూ.15 వేలు ఉంటే ప్రస్తుతం రూ.5 వేలుకు తగ్గిపోయింది.
● గత ఏడాది కంటే తగ్గిన దిగుబడి
గత ఏడాది కంటే ఈ ఏడాది మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది మామిడి దిగుబడి ఎకరానికి 3 టన్నులు వచ్చింది. ఈ ఏడాది టన్నున్నర నుంచి 2 టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. గత ఏడాది కంటే ఈ ఏడాది టన్ను నుంచి టన్నున్నర వరకు దిగుబడి తగ్గిపోయింది.


