పూసపాటిరేగ: భోగాపురం మండలం బైరెడ్డిపాలెంలో నిరుపేద రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. యంత్రాలతో బలవంతపు భూసేకరణ చేయడానికి ప్రయత్నించడంతో రెండు రోజులుగా ఉద్రిక్త్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిహారం చెల్లించకుండానే జిరాయితీ భూములులో పనులు ప్రారంభించడంతో గ్రామానికి చెందిన బైరెడ్డి అప్పలనర్సయ్య అనే వృద్ధ రైతు పనులు అడ్డగించారు. తమకు చెందిన భూములకు సంబంధించి పరిహారం తీసుకోకపోయినా బలవంతంగా భూసేకరణ చేయడానికి ప్రయత్నించడంతో రోడ్డున పడ్డామని బైరెడ్డి అప్పలనర్సయ్య, శీరపు అప్పయ్యమ్మ, బైరెడ్డి పెంటయ్య, బైరెడ్డి సూరి, బైరెడ్డి అప్పలరాములు, బైరెడ్డి దుర్గయ్య, బైరెడ్డి అప్పన్న, సరగడ రాముడులు వాపోయారు. కంచేరు రెవెన్యూ పరిధిలో గల సర్వే నెంబరు 72–11, 72–16లో బలవంతపు భూసేకరణ చేస్తున్నారని శుక్రవారం పనులు అడ్డుకున్న బైరెడ్డి అప్పలనర్సయ్య కుటుంబాన్ని జేసీబీ బకెట్‌తో పక్కకు నెట్టారు. భోగాపురం ఎస్‌ఐ పాపారావు, జీఎంఆర్ సిబ్బందితో కలిసి శనివారం ఎయిర్‌పోర్టు రహదారి నిర్మాణ పనులు మరలా ప్రారంభించారు. పరిహారం తీసుకోకుండానే బలవంతంగా భూసేకరణ చేయడం దుర్మార్గం అని, సర్కారు బలవంతపు భూసేకరణ దారుణమని వాపోయారు.
బడాబాబుల భూములు తప్పించి
ఎయిర్‌పోర్టు అప్రోచ్ రహదారి వాస్తవానికి అటాచ్ రోడ్డుకు కనెక్టింగ్ వేరే మార్గం ద్వారా ఇవ్వాల్సి వుండగా, కేవలం ఆ మార్గంలో బడాబాబుల భూములు వుండటంతో నిరుపేదల భూముల వైపు ప్రతిపాదనలు మార్చి రహదారి నిర్మాణానికి పూనుకొన్నారని ఆరోపించారు. చిన్న, సన్నకారు రైతులనే లక్ష్యంగా చేసుకొని భూసేకరణ చేశారన్నారు. తక్షణమే నిరుపేద రైతులకు ప్రభుత్వ న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దార్ హరి వద్ద ప్రస్తావించగా ఇప్పటికే నోటిఫికేషన్ ప్రకారం ల్యాండ్‌కు సంబంధించిన విషయం కోర్టులో ఉందని తెలిపారు. బైరెడ్డిపాలెంలో ఆయా రైతులకు జూన్ 15 తరువాత పరిహారం మంజూరు అవుతుందని చెప్పారు.
బైరెడ్డిపాలెంలో దాష్టీకం
బలవంతపు భూసేకరణను
అడ్డుకున్న రైతులు
రెండు రోజులుగా ఎయిర్‌పోర్టు రహదారి నిర్మాణ పనుల్లో ఉద్రిక్తత
పోలీసు పహరాలో పనులు


