ఎంపీఎఫ్‌సీ గోదాములను వినియోగంలోకి తేవాలి : జేసీ | - | Sakshi
Sakshi News home page

ఎంపీఎఫ్‌సీ గోదాములను వినియోగంలోకి తేవాలి : జేసీ

May 17 2026 12:36 AM | Updated on May 17 2026 12:36 AM

విజయనగరం ఫోర్ట్‌: బహుళ ప్రయోజన సౌకర్య కేంద్రాలను (ఎంపీఎఫ్‌సీ గోదాములు) వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ అన్నారు. జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇంప్లిమెంటేషన్‌ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 38 ఎంపీఎఫ్‌సీ గోదాముల నిర్మాణాన్ని చేపట్టగా వీటిలో ఇప్పటి వరకు 27 భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని, వీటిన్నంటిని వినియోగంలోకి తీసుకురావాలన్నారు. స్థానిక పరిస్థితులు బట్టి వ్యవసాయ అవసరం లేని పక్షంలో ఎవరికై నా లీజుకు ఇచ్చి, ఇతర ప్రజావసరాలకు వినియోగించాలని అన్నారు. ప్రతీ గోదాముకు రహదారి సౌకర్యం, విద్యుత్‌, నీటి సదుపాయం కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు, డ్వామా పీడీ శారదాదేవి, మార్కెటింగ్‌ శాఖ ఏడీ రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌశలం ద్వారా యువతకు ఉపాధి

కౌశలం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి కల్పించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ అన్నారు. కౌశలం కార్యక్రమం అమలుపై రాష్ట్ర ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్‌ అమరావతి నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యువతకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు కౌశలం కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.

‘డెంగీ’పై అవగాహన అవసరం : డీఎంహెచ్‌ఓ

విజయనగరం ఫోర్ట్‌: డెంగీ వ్యాధి పట్ల ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగీ లక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే చికిత్స తీసుకోవాలన్నారు. దోమల పెరుగుదలను నియంత్రించడం కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమ తెరలను ఉపయోగించాలన్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. మాక్‌ ఎలీసా టెస్ట్‌ ద్వారా డెంగీ వ్యాధిని నిర్ధారిస్తారన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ డాక్టర్‌ కె.రాణి, డీఎంఓ రఘువంశీ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యానికి మించి పోస్టల్‌ బీమా పాలసీలు

పోస్టల్‌ సూపరింటెండెంట్‌ బాబూరావు

బొబ్బిలి: గతేడాది పోస్టల్‌ బీమా పాలసీలను లక్ష్యానికి మించి సేకరించామని పోస్టల్‌ సూపరింటెండెంట్‌ రెడ్డి బాబూరావు అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఈ ఏడాది లక్ష్యాలపై సమాయత్త సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గతేడాది రూ.60 కోట్ల లక్ష్యం కాగా రూ.60 కోట్ల పాలసీలు సేకరించినట్టు చెప్పారు. ఈ ఏడాది రూ.110 కోట్ల లక్ష్యం విధించినట్టు చెప్పారు. రామభద్రపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో సబ్‌ పోస్టాఫీసులను ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్‌ సేవలను మరింత అధికంగా అందజేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగమిదన్నారు. గతేడాది లక్ష్యాలను అధిగమించిన సిబ్బంది, అధికారులకు సూపరింటెండెంట్‌ చేతుల మీదుగా ప్రోత్సాహకాలు, ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు. బొబ్బిలి ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాసరావు, పోస్టుమాస్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement