మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

May 17 2026 12:36 AM | Updated on May 17 2026 12:36 AM

ప్రతి నెలా పంపిణీ కాని పింఛన్ల

వివరాలు అందించాలి

స్థాయి సంఘం సమావేశంలో

జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం రూరల్‌: జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగిలే అధికారులు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశం మందిరంలో జడ్పీ చైర్మన్‌ అధ్యక్షతన శనివారం స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణం, ప్రణాళిక, ఆర్థిక సంఘం, వ్యవసాయ సంఘం, విద్య, వైద్య సంఘం, సంక్షేమ సంఘం, మహిళా శిశు సంక్షేమ సంఘం, కమ్యూనికేషన్లు, పనులు, తాగునీరు, పారిశుధ్య సంఘాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ డీఆర్‌డీఏ పనితీరును అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల పనితీరు, అప్పుల వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. వ్యవసాయం, నీటి పారుదల సమీక్షలో భాగంగా రాబోయే వర్షాకాలానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. సాగునీటి విడుదలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు గోనె సంచులకు చెల్లించాల్సిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఉపాధి హామీ పురోగతిపై చర్చించారు. పనుల్లో నాణ్యత పాటించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా నాలుగు మరణాలు సంభవించడం విచారకరమని, మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. పనుల వద్ద నీడ, తాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన గృహ ప్రవేశాలు, కొత్తగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలను అధికారులు సభ్యులకు వివరించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఇ.నాగలక్ష్మి, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement