నెలకు రూ.4.70 కోట్ల భారం | - | Sakshi
Sakshi News home page

నెలకు రూ.4.70 కోట్ల భారం

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

రోజుకి రూ.200 ఆదాయం రావడం లేదు

ఉచిత బస్సు వల్ల మా ఆటోలు ఎవరూ ఎక్కడం లేదు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాం. రోజుకి రూ.200 కూడా ఆదాయం రావడం లేదు. నా ఆటో పెట్రోల్‌తో నడుస్తుంది. ధర పెరగడం వల్ల మాపై అదనపు భారం పడనుంది. ఇక కుటుంబ జీవనం కష్టమే. – ఆనంద్‌, ఆటో డ్రైవర్‌, విజయనగరం

మోయలేని భారమే..

విశాఖ జిల్లా తగరపువలస సమీపంలో ఉన్న ప్రైవేటు కాలేజీలో పని చేయడానికి ప్రతీ రోజు బైక్‌పై వెళతాను. ప్రతీ రోజు 70 కిలోమీటర్లు వరకు ప్రయాణం చేస్తాను. ప్రస్తుతం రోజుకి రూ.120 వరకు పెట్రోల్‌ ఖర్చు అవుతుంది. ఇప్పుడు పెట్రోల్‌కు రూ.3.29 పెరగడం వల్ల మరింత అదనపు భారం పడనుంది. ఇలా అయితే సామాన్యులకు కష్టమే కదా..

– శివ, ప్రైవేటు ఉద్యోగి,

గంట్యాడ మండలం

విజయనగరం ఫోర్ట్‌:

ధికారంలోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఊరువాడా గొప్పగా ప్రచారం చేశారు. పక్క రాష్ట్రంలో కంటే మన రాష్ట్రంలో పెట్రోల్‌ ఎక్కువ అమ్ముతున్నారని గత ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలనలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించకపోగా ధరలు పెంచడం పట్ల వాహనదారులు మండిపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులతో పాటు ఆటో కార్మికులు, రైతులకు ఇది ఇబ్బందికర పరిస్థితే. నిన్న, మొన్నటి వరకు పెట్రోల్‌, డీజిల్‌ దొరక్క వాహనదారులు అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఏకంగా ధరలు పెంచడంతో మరింత ఇబ్బంది పడనున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన ప్రభుత్వం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రభుత్వం పెంచింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 పెంచారు. నిన్నటి వరకు పెట్రోల్‌ ధర 109.74 ఉండగా పెరిగిన ధర 113.03 అయింది. డీజిల్‌ ధర రూ.97.57 ఉండగా పెరిగిన ధరతో 100.71 అయింది.

ఆటో కార్మికులకు ఇబ్బందే..

ఉచిత బస్సు కారణంగా ఆటో కార్మికులకు బేరాలు లేక అవస్థలు పడుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన కారణంగా వారు మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. జిల్లాలో మూడు లక్షల వరకు ఆటోలు ఉంటాయి. వీటిలో పెట్రోల్‌తో కొన్ని నడవగా, డీజిల్‌తో కొన్ని నడుస్తున్నాయి. వచ్చే ఆదాయం తక్కువ, ధరలు పెరగడం వల్ల మరింత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ద్విచక్ర వాహనాలపై నిత్యం వెళ్లేవారికి కూడా ఇబ్బందే. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు పరిశ్రమల్లో పని చేసే వారు వేల సంఖ్యలో తమ సంస్థలకు వాహనాలపై ప్రయాణం చేస్తుంటారు. పెరిగిన పెట్రోల్‌ ధరల వల్ల వీరందరిపై అదనపు భారం పడనుంది.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన ప్రభుత్వం

జిల్లాలో 136 పెట్రోల్‌ బంక్‌లు

పెట్రోల్‌పై రూ.3.29 పెంపు

డీజిల్‌పై రూ.3.14 పెంచిన వైనం

వాహనదారులపై నెలకు

రూ.4.70 కోట్ల భారం

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన కారణంగా వాహనదారులపై నెలకు కోట్లాది రుపాయిల భారం పడనుంది. జిల్లాలో సుమారుగా 2 లక్షల లీటర్ల పెట్రోల్‌, 2.90 లక్షల లీటర్ల వరకు డీజిల్‌ వినియోగం అవుతుంది. పెట్రోల్‌ ధర పెరిగిన కారణంగా రోజుకి రూ.6.60 లక్షల వరకు భారం పడనుంది. డీజిల్‌ ధర పెరిగిన కారణంగా రోజుకి సగటున రూ.9 లక్షల వరకు భారం పడనుంది. నెలకు సుమారు పెట్రోల్‌, డీజిల్‌ ధర పెరగడం వల్ల రూ.4.70 కోట్ల వరకు భారం పడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement