ఖాతాలు సక్రమంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఖాతాలు సక్రమంగా నిర్వహించాలి

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి

విజయనగరం ఫోర్ట్‌: మండల సమాఖ్య ఖాతాలు సక్రమంగా నిర్వహించాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి అన్నారు. స్థానిక జిల్లా సమాఖ్య కార్యాలయంలో 27 మండలాల మండల సమాఖ్య ఖాతాలు, ఎఫ్‌పీఓ ఖాతాలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖర్చు చేసిన వివరాలు రికార్డుల్లో పక్కాగా నమోదు చేయాలన్నారు. లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. శిక్షణలో ఏపీడీ కె.సావిత్రి, డీపీఎం సీతారామయ్య, విశ్వేశ్వరరావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మాధవి, మేనేజర్‌ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే భోగాపురం విమానాశ్రయం ప్రారంభం

పనులను సమీక్షించిన కేంద్ర మంత్రి

పూసపాటిరేగ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 99.3 శాతం పనులను పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్‌.మాధవ్‌తో కలిసి ఆయన విమానాశ్రయ పనులను శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ విమానాశ్రయంలో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించామని, దీని ద్వారా ప్రపంచంతో ఉత్తరాంధ్ర అనుసంధానం కాబోతోందన్నారు. ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం తర్వాత ఈ ప్రాంతం అభివృద్ధి వైపు బలమైన అడుగులు వేస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం తనిఖీ

నెల్లిమర్ల: పట్టణంలో ఈవీఎంలు భద్రపరిచిన గోదాంను కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించిన కలెక్టర్‌ భద్రత ఏర్పాట్లు, గోదాం తాళాలు, సీళ్లను తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత రిజిస్టర్లపై సంతకం చేశారు. ఆయన వెంట ఆర్‌డీఓ సాగర్‌, తహసీల్దార్‌ శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.

బడి బస్సులకు భద్రతా పరీక్ష

పార్వతీపురం రూరల్‌ : విద్యార్థుల సురక్షిత ప్రయాణమే సంకల్పంగా పార్వతీపురం మన్యం జిల్లాలో బడి బస్సుల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. పారదర్శక సేవలే లక్ష్యంగా జిల్లా రవాణా అధికారి (డీటీఓ) దుర్గాప్రసాద్‌ రెడ్డి శుక్రవారం క్షేత్ర స్థాయిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 95 పాఠశాల బస్సులకుగాను, ఇప్పటివరకు 63 వాహనాల పరిశీలన పూర్తయింది. ఈ తనిఖీల్లో బస్సుల సాంకేతిక స్థితిగతులు, భద్ర తా ప్రమాణాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాల ఫిట్‌నెస్‌ నిర్ధారించడమే ఈ డ్రైవ్‌ ముఖ్య ఉద్దేశమని డీటీఓ స్పష్టం చేశారు. ప్రస్తుతం వివిధ మరమ్మతుల్లో ఉన్న మిగిలిన 32 బస్సులను కూడా బాగు చేయించిన అనంతరం.. నిర్ణీత గడువులోగా తనిఖీ ప్రక్రియ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని అధికారులను డీటీఓ ఆదేశించారు. ప్రభుత్వ వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరవేయడంలో మీడియా అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement