● అంతర్జాతీయ అనుసంధానతకు గేట్‌వేగా విశాఖ
● ఆంధ్రా టూర్స్ – ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌మోహన్
పూసపాటిరేగ: రాబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర పర్యాటక, ఆతిథ్య రంగాల భవిష్యత్తును పూర్తిగా మార్చేయనుందని ఆంధ్రా టూర్స్ – ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్‌మోహన్ అన్నారు. శుక్రవారం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకను పెంచుతూ, తూర్పు తీరంలో పర్యాటకం, వాణిజ్యానికి ఈ విమానాశ్రయం ఒక కీలక గేట్‌వేగా మారబోతోందన్నారు. కొత్త విమానాశ్రయం కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదని, ఇది ప్రాంతీయ అభివృద్ధిని, ఉపాధిని నడిపించే వ్యూహాత్మక వృద్ధి ఇంజిన్ అన్నారు. ప్రముఖ అంతర్జాతీయ హోటల్ బ్రాండ్లు ఇక్కడికి వస్తుండటంతో విశాఖపట్నం వేగంగా ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారుతోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ దీనికి గేమ్–ఛేంజర్ కానుందని ఆయన పేర్కొన్నారు.
ఆధ్యాత్మిక, అంతర్జాతీయ పర్యాటక ఆకర్షణ
రాష్ట్రంలో బౌద్ధ, గిరిజన పర్యాటక సర్క్యూట్‌ల అభివృద్ధి ద్వారా ఆసియాన్, తూర్పు ఆసియా దేశాల నుంచి ఆధ్యాత్మిక పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించే అవకాశం ఉందని విజయ్‌మోహన్ వివరించారు. మౌలిక సదుపాయాలను కేవలం రవాణా కోణంలోనే కాకుండా ఆర్థిక ప్రగతికి సాధనంగా చూస్తున్న తరుణంలో, భోగాపురం విమానాశ్రయం తూర్పు తీర ప్రాంత పర్యాటక ఆధారిత ఆర్థిక వృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.


