మృతి చెందిన కానిస్టేబుల్‌ భార్యకు చెక్కు అందజేత | - | Sakshi
Sakshi News home page

మృతి చెందిన కానిస్టేబుల్‌ భార్యకు చెక్కు అందజేత

May 16 2026 4:59 AM | Updated on May 16 2026 4:59 AM

విజయనగరం క్రైమ్‌: విధి నిర్వహణలో మృతి చెందిన కానిస్టేబుల్‌ భార్య దమయంతికి ఎస్పీ దామోదర్‌ శుక్రవారం తన చాంబర్‌ లో గ్రూప్‌ పర్సనల్‌ ఏక్సిడెంట్‌ ఇన్సూరెన్సు పాలసీ ద్వారా మంజూరైన రూ. 20.95 లక్షల చెక్కును అందజేశారు. గజపతినగరం పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న టి.తిరుపతిరావు రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్యక్రమంలో ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ మాట్లాడుతూ ప్రమాదంలో మరణించినందున గ్రూప్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ ఇన్సూరెన్సు పాలసీ మంజూరు చేసేందుకు డీపీఓ నుంచి హెడ్‌ క్వార్టర్‌కు ప్రతిపాదనలు పంగా ప్రతిపాదనలను పరిశీలించి తిరుపతిరావు కుటుంబానికి పర్సనల్‌ ఆక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌ బెనిఫిట్స్‌ మంజూరైందని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్‌ వి.లలిత పాల్గొన్నారు.

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ‘వెల్ఫేర్‌ డే’

పార్వతీపురం రూరల్‌: అహర్నిశలు ప్రజాసేవలో అంకితమయ్యే పోలీస్‌ సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులను తొలగించడమే తమ మొదటి ప్రాధాన్యమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘పోలీస్‌ వెల్ఫేర్‌ డే’ (గ్రీవెన్స్‌ డే) వేదికగా ఆయన సిబ్బందితో ముఖాముఖి భేటీ అయ్యారు. విధుల్లో ఎదురయ్యే సవాళ్లతో పాటు, సిబ్బంది ఆరోగ్యం, కుటుంబ సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసట ఎరుగక శ్రమించే సిబ్బందికి అండగా నిలవడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసుల నుంచి ఆయన వినతులను స్వీకరించారు. ప్రధానంగా అనారోగ్య సమస్యలు, బదిలీలకు సంబంధించిన విన్నపాలు ఎస్పీ దృష్టికి వచ్చాయి. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, సమస్యల పూర్వాపరాలను ఆరా తీసి, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్‌ కార్యాలయం సీసీ సంతోష్‌ కుమార్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మోపెడ్‌ అదుపుతప్పి

యువకుడికి గాయాలు

బలిజిపేట: మండలంలోని బలిజిపేట–పెదపెంకి రోడ్డులో ద్విచక్రవాహనం అదుపుతప్పడంతో వెంగాపురం గ్రామానికి చెందిన బండి వెంకటేష్‌ గాయాల పాలయ్యాడు. బలిజిపేట–పెదపెంకి మార్గంలో రోడ్డుపక్కన పడిఉన్న వెంకటేష్‌ను అటువైపుగా వెళ్తున్న వారు చూసి బలిజిపేట పీహెచ్‌సీకి తరలించారు. మోపెడ్‌పై వెళ్తున్న వెంకటేష్‌ దానిని అదుపుచేయలేకపోవడంతో గాయాల పాలై పడిపోయి ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. వెంకటేష్‌కు పీహెచ్‌సీలో వైద్యసేవలు అందించి మెరుగైన వైద్యం నిమిత్తం పార్వతీపురం పీహెచ్‌సీకి తరలించారు.

గాయపడిన వ్యక్తి మృతి

తెర్లాం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి శుక్రవారం మృతి చెందాడు. దీనికి సంబంధించి తెర్లాం ఎస్సై సాగర్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాడంగి మండలం వాడాడకు చెందిన గొట్టాపు శ్రీనివాసరావు(47)ద్విచక్ర వాహనాన్ని మండలంలోని కూనాయవలస జంక్షన్‌ వద్ద ఈనెల 11న లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స కోసం విజయనగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. హెచ్‌సీ నాగేశ్వరరావు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement