మార్చురీ వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

మార్చురీ వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

విజయనగరం ఫోర్ట్‌: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీలో పోస్టుమార్టం చేసేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారనే అంశంపై ‘శవాలపై కాసులవేట ..!’ అనే శీర్షికన సాక్షిలో ఈనెల 11న ప్రచురితమైన కథనానికి ఆస్పత్రి అధికారులు స్పందించారు. మార్చురీ వద్ద లంచం తీసుకోవడం, ఇవ్వడం నేరమనే బోర్డులను ఏర్పాటుచేశారు. లంచం అడిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో ఫోన్‌నంబర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మార్చురీ సిబ్బందిని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలని ఆర్‌ఎంఓను ఆదేశించినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అల్లు పద్మజ తెలిపారు.

ఐటీఐ ఉత్తీర్ణులకు జర్మన్‌ భాషపై ఉచిత శిక్షణ

విజయనగరం రూరల్‌: స్థానిక జేఎన్‌టీయూ జీవీలో ఇండో–యూరో సింక్రోనైజేషన్‌ ఆధ్వర్యంలో జర్మన్‌ భాష ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని ఐటీఐ ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ ఉత్తీర్ణులు సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ వి.వి.సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణకు సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత జర్మన్‌ భాషా శిక్షణలో ఏ–2 లెవెల్‌ ఉత్తీర్ణత పొందిన వారికి జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇండో–జర్మన్‌ సింక్రమైజేషన్‌ సంస్థ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులుకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థుల వయో పరిమితి 19 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. సుమారు 3 నెలలపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో గాని, బ్రోచర్‌లోని క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ జీవీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డి.రాజ్యలక్ష్మి, శిక్షణాధికారిణి వి.ఎస్‌.వకుళ, తదితరులు పాల్గొన్నారు.

పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు

బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన

తెర్లాం: బొబ్బిలి నియోజకవర్గం పరిధిలోని తెర్లాం మండలంలో బీటీ రోడ్డు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన తెలిపారు. తారు, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడమే దీనికి కారణంగా పేర్కొన్నారు. కొరటాంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పణుకువలస నుంచి వంతరాం వరకు గల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3.5కోట్లు, సుందరాడ–గలావల్లి రోడ్డుకు కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, అప్పటివరకు పనులు జరిగే అవకాశం లేదన్నారు.

చోరీకి యత్నం

పట్టుబడిన నిందితుడు

బొబ్బిలిరూరల్‌: మండలంలోని చింతాడ గ్రామంలోని కర్రిపార్వతి ఇంటిలోకి చొరబడి చోరి యత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఉపాధిహామీ పనులకోసం బయటకు వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి పథకం ప్రకారం చోరీకి పాల్పడుతున్న రొంపిల్లి గ్రామానికి చెందిన మణికంఠను గ్రామస్తులు పట్టుకున్నారు. సీఐ నారాయణరావుకు అప్పగించారు. విచారణ జరుపుతున్నట్టు సీఐ తెలిపారు.

తైక్వాండో పోటీల రిఫరీగా బొబ్బిలి క్రీడాకారుడు

బొబ్బిలి: తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న తైక్వాండో పోటీలకు బొబ్బి లి పట్టణానికి చెందిన యువ క్రీడాకారుడు బంగారి కిశోర్‌కుమార్‌ రిఫరీగా ఎంపికై నట్టు కోచ్‌ ప్రసాద్‌ గురువారం తెలిపా రు. జిల్లా తైక్వాండో కార్యదర్శి వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో రిఫరీగా ఎంపికయ్యాడన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement