2026–27 రబీలో సాగుచేసిన మొక్కజొన్న, వరి పంటలకు మద్దతు ధర లభించలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు, రైతు సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. వరికి గతేడాది మద్దతు ధర క్వింటాకు రూ.2,369గా ప్రకటించారు. కానీ కొనుగోలు కేంద్రాలు లేక పోవడం వల్ల 105 కేజీల ధాన్యం రూ.1800, రూ.1900కు వ్యాపారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి. మొక్కజొన్న క్వింటాకు మద్దతు ధర రూ.2,400 కాగా, కొనుగోలు కేంద్రాలు లేక పోవడం వల్ల వ్యాపారులకు రూ.1600, రూ.1700కు విక్రయించుకోవాల్సిన దుస్థితి. పెసర, మినుము పంటలకు సంబంధించి ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెసర, మినుము పంటల ఉత్పత్తి 38,373 మెట్రిక్ టన్నులు రాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు ద్వారా కేవలం 39 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. పెసర, మినుము పంటలకు కూడా మద్దతు ధర రాని పరిస్థితి. క్వింటాకు రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్ట పోయారు.


