● చుట్టుపక్కల గ్రామాల్లో అవగాహన కల్పించాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
పూసపాటిరేగ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పక్షులు, వన్యప్రాణుల ద్వారా ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ అధ్యక్షతన రెండవ ఏరోడ్రోమ్ ఎన్విరానన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంతర్జాతీయ విమానయాన భద్రతా ప్రమాణాల ప్రకారం విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఎటువంటి విఘాతం కలగకుండా ఉండడమే ఈ కమిటీ ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకృతికి అనుకూలమైన, సురక్షితమైన, సుస్థిరమైన విమానాశ్రయ వాతావరణాన్ని కల్పించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. విమానాశ్రయం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో పక్షులు, కుక్కలు లేదా ఇతర వన్యప్రాణులు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పక్షులు విమానం ఇంజినన్‌లోకి వెళ్లడం వల్ల జరిగే భారీ ప్రమాదాలను నివారించేందుకు ఈ ప్రాంతాన్ని ‘బర్డ్ స్ట్రైక్ ఫ్రీ జోన్’గా మార్చాలని ఆదేశించారు. విమానాశ్రయ పరిసరాల్లో మాంసం దుకాణాలు, బహిరంగ వ్యర్థాలు ఉండడం వల్ల పక్షులు ఆహారం కోసం వస్తుంటాయని, అందుకే చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ పేర్కొన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా, సమగ్ర చెత్త నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితి సంతప్తికరంగా ఉందని, భవిష్యత్తులో పక్షులు, వన్యప్రాణుల వల్ల ముప్పు పెరగకుండా చూడాలని కోరారు. దీనికోసం విమానాశ్రయ నిర్వహణ సంస్థ, స్థానిక పరిపాలన యంత్రాంగం మధ్య నిరంతర సమన్వయం ఉండాలని, ఈ మేరకు విమానాశ్రయ సమీపంలోని ఈఓపీఆర్డీలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.
విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
అన్ని రకాల భద్రతా చర్యలు పాటించాలంటే ప్రజల సంపూర్ణ సహకారం అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. అందువల్ల విమానాశ్రయ సమీపంలోని సుమారు 21 గ్రామాల్లో నివసించే ప్రజలకు పారిశుధ్యం, నిబంధనలు, విమాన ప్రయాణ భద్రత పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. వెంటనే అవగాహనా కార్యక్రమాలను మొదలుపెట్టాలని ఆదేశించారు. అనంతరం విమానాశ్రయ నిర్మాణ ప్రగతిని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో భోగాపురం విమానాశ్రయం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లక్కీ వర్మ భాస్కర్, సీఈవో కన్వర్ బీర్ సింగ్ కలరా, ప్రాజెక్ట్ హెడ్ బీహెచ్‌ఏ రామరాజు, వన్యప్రాణి రక్షణ నిపుణులు బిభూ దత్తా పాడి, ఎయిర్ సైడ్ ఆపరేషన్స్ హెడ్ విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ ఎస్.జీవన రాణి, ఆర్డీవో సుధాసాగర్, పీసీబీ ఈఈ బీబీ సరిత, డీపీవో మల్లికార్జునరావు, మత్స్యశాఖ డీడీ విజయ్‌కృష్ణ, డీఎఫ్‌ఓ ఎం.సోమసుందర్, ఎఫ్‌ఆర్‌ఓ బి.రాంనరేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


