రేగిడి: చేతికి అందొచ్చిన కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడని ఎంతో ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. కళ్లెదుటే కన్నకుమారుడు బస్సు ప్రమాదంలో మృతిచెందడం చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో పనసలవలస గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రేగిడి మండల పరిధిలోని పనసలవలస గ్రామానికి చెందిన నారు అప్పలనాయుడు, నారు సత్యవతి, వారి పెద్దకుమారుడు సాయి అనిల్‌కుమార్(24), చిన్నకుమారుడు నారు గోపాల్‌తో కలిసి విజయవాడలో బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి బుధవారం సాయంత్రం ప్రైవేట్ బస్సులో బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి మండలం యర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున 3.30 గంటలకు రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న టిప్పర్ బస్సును ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగంలో పనసలవలస గ్రామానికి చెందిన సాయి అనిల్‌కుమార్ కూర్చోవడంతో బస్సును టిప్పర్ ఢీకొనడంతో సాయిఅనిల్‌కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా గోపాల్‌తో పాటు తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. తమ కళ్లెదుటే కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.
కుటుంబానికి అండగా ఉంటానన్నాడు..
కాయకష్టంచేసి ఇద్దరు అన్నదమ్ములను డిగ్రీ వరకు చదివించామని, పీజీచేసి ఉద్యోగాలు సంపాదించి కుటుంబానికి అండగా ఉంటానని సాయిఅనిల్‌కుమార్ అన్నమాటలను కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు గుర్తు చేసుకుని విలపిస్తున్నారు. అందరిలో మంచివ్యక్తిగా పేరు సంపాదించిన సాయిఅనిల్‌కుమార్ కష్టపడి చదివే మనస్తత్వం ఉన్న యువకుడు చనిపోవడం దారుణమని, ఇటువంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని గ్రామస్తులు వాపోతున్నారు.
కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుంటే అనంతలోకాలకు పయనం
పెళ్లికి వెళ్లుండగా బస్సు ప్రమాదం
కంటికీమింటికీ ఏకధారగా రోదిస్తున్న కుటుంబసభ్యులు
పనసలవలస గ్రామంలో విషాదఛాయలు


