సామాజిక రుగ్మతలపై పోలీస్‌ ‘నజర్‌’ | - | Sakshi
Sakshi News home page

సామాజిక రుగ్మతలపై పోలీస్‌ ‘నజర్‌’

May 15 2026 12:19 PM | Updated on May 15 2026 12:19 PM

సామాజిక రుగ్మతలపై పోలీస్‌ ‘నజర్‌’

బాల్య వివాహాలు, అక్రమ రవాణా

నిర్మూలనకు సమష్టి కృషి

పోలీసులకు అవగాహన సదస్సులో

ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి

పార్వతీపురం రూరల్‌: సమాజ పురోగతికి ఆటంకంగా మారిన బాల్య వివాహాలు, టీనేజ్‌ ప్రెగ్నెన్సీ, బాండెడ్‌ లేబర్‌ వంటి సామాజిక రుగ్మతలను సమూలంగా తుడిచిపెట్టడమే లక్ష్యంగా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. అ మేరకు ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి ఆదేశాలతో గురువారం స్థానిక పోలీస్‌ మల్టీ ఫంక్షన్‌ హాల్‌లో పోలీసు అధికారులకు ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్‌ నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తోట కనకదుర్గ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక అరిష్టాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో బాల్య వివాహాలు, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వంటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం వెల్లివిరిసేలా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చైతన్యమే ఆయుధంగా, చట్టమే కవచంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కనకదుర్గ, డీసీపీఓ సత్యనారాయణ మాట్లాడుతూ..18 ఏళ్ల లోపు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల బాలికల విద్య, ఆరోగ్యం ఛిన్నాభిన్నమవుతాయని పేర్కొన్నారు. టీనేజ్‌ ప్రెగ్నెన్సీ వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలు, వెట్టిచాకిరీ, మానవ అక్రమ రవాణా వంటి అంశాలపై పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా పోక్సో చట్టం–2012, చైల్డ్‌ మ్యారేజ్‌ యాక్ట్‌–2006 పై అవగాహన కల్పిస్తూ, ఎక్కడైనా బాల్య వివాహాలు లేదా బాల కార్మిక వ్యవస్థ వంటి ఘటనలు గమనిస్తే తక్షణమే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ ’1098’ కు సమాచారం అందించేలా ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. పోలీస్‌, మహిళా శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే బాలల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement