పాలకొండ రూరల్: పొట్టకూటి కోసం ఉపాధిహామీ పనులకు వెళ్తున్న వేతనదారు వడదెబ్బకారణంగా మృత్యువాత పడ్డాడు. పాలకొండ మండలంలోని భాసూరు గ్రామానికి చెందిన వేతనదారు కోమటి పుష్పనాథం(62)గురువారం గ్రామ సమీపంలో రావాడ గెడ్డ వద్ద పనులు చేస్తున్నాడు. ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. సహచర వేతనదారులు సపర్యలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగిలి పుష్పనాథంమరణించాడని వేతనదారులు వాపోయారు. మండల వ్యాప్తంగా ప్రస్తుతం ఉపాధిపనుల వద్ద వేతనదారులు విశ్రాంతి తీసుకునేందుకు ఎటువంటి టెంట్లు లేకపోవడం ఈ పరిస్థితికి కారణమని సహ వేతనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతునికి భార్య కళావతితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు కలెక్టర్, శాఖాపరమైన ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించి మృతుని కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అయ్యకోనేరులో మృతదేహం
గుర్తింపు..
విజయనగరం క్రైమ్: విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అయ్యకోనేరులో గురువారం ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గురాల గురవాజీ(40) అనే వ్యక్తి తన భార్య పోలమ్మతో పూల్‌బాగ్ కాలనీలో నివాసముంటున్నాడు. కుటుంబ పోషణ కోసంచేపల వేట వృత్తి చేస్తున్న గురవాజీ తన స్నేహితులు సత్తయ్య, వాసుపల్లి పెద్దయ్య, ఎర్రపల్లి శివలతో కలిసి అయ్యకోనేరుకు వెళ్లాడు. ఆ క్రమంలో ఫిట్స్ వచ్చి పడిపోయినట్లు గురవాజీ భార్య పోలమ్మకు ఎర్రపల్లిశివ ఫోన్ చేసి చెప్పడంతో ఆమె ఘటనా స్థలికి వెళ్లి చూసేసరికి అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.


