పేద కుటుంబాల పిల్లల పెళ్లి ఖర్చులకు ఆర్థిక సాయం చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేసిన కల్యాణమస్తు, షాదీతోఫాకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడేసింది. పెళ్లి కానుక ఇస్తామంటూ రెండేళ్లుగా ఊరించింది. ఏ ఒక్కరికీ కానుకలు అందజేయకుండానే పథకానికి పాతరేసింది. తాజాగా కల్యాణలక్ష్మి పేరుతో పావలా వడ్డీకి రుణం ఇచ్చే పథకాన్ని తెరపైకి తెచ్చింది. కల్యాణాన్ని కాస్త రుణమయంగా మార్చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరును మహిళలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతటి మోసపూరిత పాలనను ఎన్నడూ చూడలేదంటూ మండిపడుతున్నారు.
విజయనగరం ఫోర్ట్:
చేసిన సాయం శూన్యమైనా... ఏదో ఇస్తున్నట్టు నమ్మించడం.. ప్రచారం చేయడం.. జనాన్ని ముంచేయడంలో చంద్రబాబుకు మించినవారు ప్రపంచంలోనే ఉండరన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. అధికారం కోసం హామీలు గుప్పించడం.. అధికారం చేతికి చిక్కాక మోసం చేయడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధి అంటూ మహిళలను ఊరించారు. నెలకు రూ.1500 చొప్పున మహిళల ఖాతాల్లో జమచేస్తామని చెప్పి మోసం చేశారు. పేదకుటుంబాల పిల్లల వివాహాల సమయంలో ‘పెళ్లి కానుక’తో ఆదుకుంటామని నమ్మించారు. రెండేళ్లలో ఏ ఒక్కరికీ పథక లబ్ధి కలిగించకుండానే ఎత్తేశారు. ఇప్పుడు కల్యాణలక్ష్మి పేరుతో పెళ్లింటికి పావలా వడ్డీ రుణం అందజేస్తామని చెబుతుండడంపై డ్వాక్రా మహిళలు నివ్వెరపోతున్నారు. ఇదెక్కడ రుణ పథకం అంటూ మండిపడుతున్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేదింటి బిడ్డల వివాహానికి కల్యాణమస్తు, షాదీ తోఫా కింద ఉచితంగా సాయమందించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకు మహిళల సంక్షేమానికి పాతరేస్తున్నారని, పేదల కష్టాలు పట్టడంలేదని వాపోతున్నారు. రెండేళ్లలో వివాహంతో ఒక్కటైన జంటలు రూపాయి సాయానికి నోచుకోలేదని నిట్టూర్చుతున్నారు.
గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కల్యాణమస్తు, షాదీతోఫా పేరుతో పేదకుటుంబాల్లో కొత్తగా పెళ్లి అయిన ఆడబిడ్డలకు ఆర్థిక సాయం అందించేది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇళ్లలో ఆడబిడ్డలకు, దివ్యాంగుల వివాహాలకు రూ.40 వేల నుంచి రూ.లక్షా50వేల వరకు ఆర్థిక సాయం చేసేది. ఇది పేద కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.
మహిళలకు
రుణం బురిడీ...
అప్పుడు అలా..
ఇదెక్కడి పథకం బాబూ..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలుచేసిన ఒక్కో పథకానికి చంద్రబాబు సర్కారు మంగళం పాడేస్తోంది. డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలకు స్వస్తిపలికింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణమస్తు, షాదీ తోఫాలను ఎత్తేసింది. పెళ్లికానుక అంటూ ఊరించి ఉసూరుమనిపించింది. ఇప్పుడు పేదింటి బిడ్డల పెళ్లిఖర్చులకు కల్యాణలక్ష్మి పథకం కింద వడ్డీతో కూడిన రుణం ఇస్తామని చెప్పడం సిగ్గుచేటు. ఉచిత సాయాన్ని ఎగ్గొట్టి పెళ్లిని రుణమయంగా మార్చడం ఎంతవరకు సమంజసం.
– సూరెడ్డి హైమావతి, మహిళా నాయకురాలు, మెంటాడ మండలం
పెళ్లి ఖర్చులకు రుణం ఇస్తాం
కల్యాణ లక్ష్మి పేరుతో ఆడ పిల్లలకు వివాహం చేసే డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు నుంచి రూ. లక్ష వరకు రుణం ఇస్తాం. పావలా వడ్డీతో కలిసి రుణాన్ని పూర్తిగా చెల్లించాలి.
– శ్రీనివాసపాణి, డీఆర్‌డీఏ పీడీ
‘పెళ్లికానుకకు’ పాతర
కల్యాణలక్ష్మి పేరుతో కొత్త ఎత్తుగడ
డ్వాక్రా మహిళల ఇళ్లలో పెళ్లికి వడ్డీతో కూడిన రుణం
పేదింటి వివాహాలకు ఇచ్చే సాయానికి మంగళం
టీడీపీ సర్కారు మాయజాలంపై
భగ్గుమంటున్న మహిళలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కల్యాణమస్తు, షాదీతోఫా పేరుతో ఆర్థిక సాయం
చంద్రబాబు సర్కార్ ఏ పథకం అమలు చేసినా దాని వెనుక ఒక మెలిక ఉంటుందన్నది జనంమాట. దీనికి కల్యాణలక్ష్మి పథకమే నిదర్శనమని చెబుతున్నారు. ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల మహిళల ఇంట్లో వివాహానికి రుణం ఇవ్వనున్నారు. రూ.10 వేలు నుంచి రూ.లక్ష వరకు రుణం ఇస్తారట. ఇచ్చిన రుణం వడ్డీతో సహా తీర్చాల్సిందే. అప్పుగా ఇచ్చే పథకానికి కూడా చంద్రబాబు సర్కార్ ఉచితంగా సాయం చేసినట్టు ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు అందజేయడంలేదు. పావలా వడ్డీ రుణాలను ఎగ్గొట్టేశారు. ఇప్పుడు కల్యాణలక్ష్మి పేరుతో ఉచితంగా అందజేయాల్సిన పెళ్లి సాయాన్ని కమిర్షియల్‌గా మార్చడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.


