పైపులతో పెద్దగెడ్డ సాగునీరు | - | Sakshi
Sakshi News home page

పైపులతో పెద్దగెడ్డ సాగునీరు

May 15 2026 10:02 AM | Updated on May 15 2026 10:02 AM

రామభద్రపురం వద్ద పెద్దగెడ్డ కాలువ

రామభద్రపురం: పెద్దగెడ్డ జలాశయాన్ని కేంద్ర ప్రభుత్వం మోడరైజేషన్‌ ఆఫ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (ఎం–కాడ్‌) పథకంలో పైలెట్‌ ప్రాజెక్టుగా గుర్తించింది. ఈ జలాశయం నుంచి హైప్రెజర్‌ డ్రిప్‌ విధానంలో అండర్‌ గ్రౌండ్‌ పైపులైన్లతో ఆయకట్టుకు సాగునీరు అందజేయనున్నారు. ఈ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం చొప్పున రూ.73 కోట్లు కేటాయించాయి. పెద్దగెడ్డ జలాశయం ప్రధాన కుడి కాలువ పరిధిలోని పాచిపెంట, రామభద్రపురం, సాలూరు మండలాలకు చెందిన సుమారు 7,500 ఎకరాలకు పైపులతో సాగునీరందించే పనులు జరగాల్సి ఉంది.

పనులు ఇలా...

పెద్దగెడ్డ జలాశయంలో బారీవెల్‌ తీస్తారు. అందులో పెద్దవి 4 హైప్రెజర్‌ మోటార్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో మూడు నిర్వహణలో ఉంచుతూ ఒకటి రిజర్వ్‌లో ఉంచుతారు. ప్రధాన పైపు నుంచి బూసాయవలస దండాసివాని చెరువు, ఎరకన్నదొర చెరువు వరకు సాగునీరు మళ్లిస్తారు. అక్కడి నుంచి బ్రాంచిల ద్వారా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేస్తారు. జలాశయం వద్ద కంట్రోల్‌ రూం ఉంటుంది. అక్కడ పంపుచేసే హెడ్‌ ఉంటుంది. ఆ హెడ్‌ ద్వారా ఏ ఏరియాకు ఎప్పు డు నీరు విడుదల చేయాలో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రైతులు నచ్చినట్లు వాడుకుని సాగునీటి వృథా చేయకుండా నీరు సరఫరా చేసే వీలుంటుంది. ఇప్పటి వరకు ఒక ఖరీఫ్‌ సీజన్‌లో మాత్రమే కొద్దోగొప్పో నీరు విడుదల చేసేవారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యాక ఖరీఫ్‌, రబీ సీజన్లలో సాగునీరు అందించనున్నట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు దగ్గర సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి విద్యుత్‌ అందించనున్నారు. పెద్దగెడ్డ జలాశయం కుడి కాలువ పరిధిలోని చెరువులను పైపులతోనే సాగునీరు నింపుతారు. పైలెట్‌ ప్రాజెక్టు పనులు పూర్తయితే రైతులకు మేలు జరుగుతుందని ఎం–కాడ్‌ డీఈఈ డి.సురేష్‌ తెలిపారు. అయితే, ఇంకా పనుల ప్రక్రియ టెండర్ల దశలోనే ఉందని, టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదన్నారు. పనులపై ఈ నెల 18వ తేదీన రైతులతో సమావేవమై అవగాహన కల్పిస్తామని చెప్పారు.

పైలెట్‌ ప్రాజెక్టు కింద పెద్ద గెడ్డ

జలాశయంను ఎం–కార్డ్‌ పథకంలో గుర్తింపు

7,500 ఎకరాలకు అండర్‌ గ్రౌండ్‌ పైపులతో సాగునీరు

Advertisement
 
Advertisement
Advertisement