● వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడంపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. మాతృమరణాలపై కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవిస్తుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉందని, విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేంది లేదని హెచ్చరించారు. మార్చి నెలలో సంభవించిన రెండు మాతృ మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోందని, బాధ్యులపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీఎంహెచ్‌ఓ జీవనరాణిని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఆశ కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, గర్భిణులు, బాలంతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీ రాణి, గైనికాలజీ హెచ్‌ఓడీ అరుణ శుభశ్రీ, డీఐఓ అచ్చుతకుమారి, తదితరులు పాల్గొన్నారు.
21 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఈ నెల 21 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందింరంలో జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ ఎస్.తవిటినాయుడుతో కలిసి పోలీస్, వైద్య, విద్యుత్, ఆరోగ్య, రవాణా తదితర శాఖల అధికారులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై కీలక సూచనలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం సెషన్ 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, విద్యార్థులకు రవాణా సౌకర్యాలు, వైద్య సహాయం, బందోబస్తు సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


