విజయనగరం గంటస్తంభం: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ (ఎన్‌ఈఈటీ) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. డాక్టర్ కావాలనే కలతో సంవత్సరాల పాటు కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయింది. అమ్మ కష్టం.. నాన్న త్యాగం.. చివరికి లీకేజీల పాలు అంటూ విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. రోజుకు గంటల తరబడి చదువులు, కోచింగ్ సెంటర్ల ఒత్తిడి, కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు.. ఇవన్నీ భరించి పరీక్ష రాసిన విద్యార్థులకు ఇప్పుడు పేపర్ లీకేజీ వార్తలు మానసికంగా తీవ్ర దెబ్బతీశాయి. దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ రాయగా, ఇప్పుడు వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 11 ఏళ్లలో 89 సార్లు పేపర్ లీకేజీలు జరగడం, 48 పునఃపరీక్షలు నిర్వహించాల్సి రావడం విచారకరమని, పరీక్ష వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విద్యార్థిసంఘాలు విమర్మిస్తున్నాయి. పరీక్షను నిజాయితీగా రాసిన విద్యార్థులు నష్టపోతుండగా, డబ్బులు పెట్టి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసే మాఫియాలు లాభపడుతున్నాయని ఆరోపించారు. వెంటేనే ఎన్‌టీఏను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
11 ఏళ్లలో 89 సార్లు లీకేజీలు..
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది పరాకాష్ట
అమ్మేసింది నీట్ పేపర్ కాదు.. విద్యార్థుల భవిష్యత్తును..
ఎన్‌టీఏను రద్దు చేయాలి..
ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్


