వ్యక్తి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అదృశ్యం

Apr 29 2026 8:42 AM | Updated on Apr 29 2026 8:42 AM

విజయనగరం క్రైమ్‌: తన తండ్రి నడిపల్లి రమణ(58) కనిపించడం లేదంటూ కూతురు పావని విజయనగరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేసింది. మతిస్థిమితం లేని కారణంగా రమణ ఈనెల 15వ తేదీన రాత్రి 8.30 గంటలకు ఇంటినుంచి బయటకు వెళ్లి నేటి వరకు తిరిగి రాలేదని కూతురు పావని ఫిర్యాదులో పేర్కొంది. సీఐ చౌదరి ఆదేశాలతో ఆవాల రమణ విచారణాధికారిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హెచ్‌సీకి తీవ్ర గాయాలు

బైక్‌ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం

గజపతినగరం రూరల్‌: మండలంలోని మధుపాడ 26వ నంబర్‌ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట్యాడ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న ఎ. శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఎస్సై కె.కిరణ్‌ కుమార్‌ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసరావుకు బొబ్బిలి దాడి తల్లి అమ్మవారి బందోబస్తుకు డ్యూటీ పడింది. ఇందులో భాగంగా విధుల నిమిత్తం శ్రీనివాసరావు తన మోటార్‌ సైకిల్‌ పై మంగళవారం సాయంత్రం బొబ్బిలి వెళ్తుండగా మండలంలోని పాలధార చెరువు వద్దకు వచ్చేసరికి బొబ్బిలి నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొంది. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ కు బలంగా గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఆటో డ్రైవర్‌ బి.బలరాం తన ఆటోలో క్షతగాత్రుడు శ్రీనివాస రావును ఎక్కించి గజపతినగరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. ఇక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో విజయనగరం కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ మితిమీరిన వేగంతో అజాగ్రత్తగా నడపడమే ప్రమాదానికి కారణమని ఎస్సై కిరణ్‌ కుమార్‌ నాయుడు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకుల మృతి

పార్వతీపురం రూరల్‌/గుమ్మలక్ష్మీపురం: ఇద్దరు యువకులు శుభకార్యానికి ఆహ్వానించేందుకు వెళ్తుండగా, మరో ఇద్దరు అశుభకార్యానికి వెళ్లి వస్తున్నారు. విధి ఆడిన వింత నాటకంలో ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీకొని ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన మంగళవారం గుమ్మలక్ష్మీపురం మండలం బెల్లిడి గ్రామ సమీపంలో జరిగింది. కురుపాం మండలం తియ్యలవలస గ్రామానికి చెందిన ఊయక గణేష్‌, సింహాచలం ఒక శుభకార్యానికి సంబంధించి కార్డులు పంచేందుకు స్కూటీపై గొరడ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో బొడ్లగూడ గ్రామానికి చెందిన కొండగొర్రి మన్మథరావు (25), కిల్లక కార్తీక్‌ రేగిడిలో జరిగిన ఓ పెదకర్మ కార్యక్రమానికి హాజరై బైక్‌పై తిరిగి వస్తున్నారు. బెల్లిడి మలుపు వద్దకు వచ్చేసరికి రెండు వాహనాలు వేగంగా ఎదురెదురుగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో మన్మథరావు అక్కడిక్కడే మృతి చెందగా, గణేష్‌ను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. గాయపడిన కార్తీక్‌, సింహాచలం ప్రస్తుతం జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement