విజయనగరంలో గంజాయి వాసన గుప్పుమంటోంది. ఎక్కడికక్కడే విక్రయాలు జోరందుకున్నాయి. వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. కొందరు యువకులు
గంజాయి రవాణా, విక్రయాలను పార్ట్‌టైమ్ బిజినెస్‌గా మార్చుకోవడం ప్రజలను, పోలీస్ శాఖను భయాందోళనకు గురిచేస్తోంది. తమ పిల్లలు ఎక్కడ గంజాయికి బానిసలవుతారోనన్న బెంగ తల్లిదండ్రులను వెంటాడుతోంది. గంజాయి మత్తులో రౌడీమూకల ఆగడాలు విద్యలనగరం ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. సభ్యసమాజాన్ని భయపెడుతున్నాయి. ప్రభుత్వ, పోలీస్‌శాఖ లోపాలను ఎత్తిచూపుతున్నాయి.
● పోలీసులే పెడ్లర్లు
కంచె చేను మేస్తుంటే కాపు ఏం చేస్తాడు అన్నట్లుగా మారింది పరిస్థితి. దొంగ చేతికి తాళం ఇచ్చినట్లుగా జిల్లాలో గంజాయి రవాణా వినియోగాన్ని అరికట్టాల్సిన పోలీసులు కొందరు స్మగ్లర్లతో చేతులు కలిపి మొత్తం పోలీస్ వ్యవస్థకు కళంకం తీసుకొచ్చారు. ఎస్.కోట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న రాంబాబు అనే కానిస్టేబుల్ ఏకంగా గంజాయి రవాణాలో కీలకంగా పనిచేసి, స్టేషన్‌లో ఉన్న 20 కిలోల గంజాయిని దొంగిలించి ఉద్యోగం నుంచి డిస్మిస్ అయ్యారు. మరో కానిస్టేబుల్ సతీష్ కూడా ఇలాంటి అనైతిక కార్యకలాపాలలో పాల్గొని వ్యవస్థకు దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంకో ఏపీఎస్పీ కానిస్టేబుల్ శివప్రసాద్ కూడా ఈ గంజాయి దందాలో దొరికిపోయి ఉద్యోగం పోగొట్టుకున్నారు. ఇంకా వ్యవస్థకు దొరకకుండా ఇలాంటి అనైతిక వ్యవహారాల్లో ఇంకా ఎంతోమంది ఉన్నట్టు సమాచారం. పోలీసులే గంజాయి వ్యాపారులతో కలిసి సమాజాన్ని విషపూరితం చేస్తున్నారని.. పోలీసులే తప్పుడు పనులు చేస్తే ఇక ఎవరిని నమ్మాలి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి


