పార్వతీపురం రూరల్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేగంగా సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పార్వతీపురం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని ఇండెక్స్ రిజిస్టర్లు, పెండింగ్‌లో ఉన్న దస్తావేజులను నిశితంగా పరిశీలించి, రికార్డుల నిర్వహణపై సిబ్బందిని ఆరా తీశారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన క్రయ విక్రయదారులతో నేరుగా మాట్లాడి, సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లలో అనవసర జాప్యానికి తావుండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల వసూలు లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని సూచించారు. వేసవి దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజల కోసం తాగునీరు, నీడ వంటి కనీస వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. తనిఖీలో సబ్ రిజిస్ట్రార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


