విజయనగరం ఫోర్ట్: వీబీ జీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ – గ్రామీణ ) పథకం అమలు మరింత జాప్యం కానుంది. వాస్తవానికి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే ఈ పథకం (ఉపాధి హామీ పథకం) అమలు కావాల్సి ఉంది. అయితే పథకం నిర్వహణకు సంబంధించిన గైడ్‌లైన్స్ నేటికీ జిల్లాకు చేరకపోవడంతో పథకం నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వీబీ జీ రామ్‌జీ పథకంగా మార్పు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త పేరుతో పథకాన్ని అమలు చేస్తామని జిల్లా నీటియాజమన్య సంస్థ ( డ్వామా) అధికారులు కూడా నిన్న, మొన్నటి వరకు తెలిపారు. కొత్తగా పని దినాలు పెరుగుతాయని.. గ్రామాల్లో అవగాహన సదస్సులు సైతం నిర్వహించారు.
125 రోజుల పనిదినాలు..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో జాబ్‌కార్డు కలిగిన కుటుంబానికి 100 రోజులు పనిదినాలు కల్పించేవారు. కొత్తగా పథకం పేరు మార్చిన తర్వాత పనిదినాల సంఖ్య పెంచారు. ఒక్కో కుటుంబానికి 125 రోజుల పాటు పని కల్పించనున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉన్నప్పుడు కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా చొప్పున నిధులు కేటాయించేవి. అయితే పథకం పేరు మార్చిన తర్వాత కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించుకోవడంతో రాష్ట్రంపై భారం పడనుంది.
జిల్లాలో 3.45 లక్షల జాబ్ కార్డులు..
జిల్లాలో ఉపాధిహామి పథకానికి సంబంధించి 3.45 లక్షల జాబ్ కార్డులు ఉండగా.. వేతనదారులు 6.26 లక్షల మంది ఉన్నారు. ఇదిలా ఉంటే 2026 – 27 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలకు మాత్రమే లక్ష్యాన్ని నిర్ణయించారు. ఏప్రిల్ నెలకు సంబంధించి వేతనదారులకు 44.44 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉంది. ఉపాధి హామీ పథకంలో చెరువులు, గుంతలు, కాలువల్లో పూడికతీతలు, జంగిల్ క్లియరెన్స్, చెరువు గట్టు ఎత్తు పెంచడం, చెరువు లోతు చేయడం వంటి పనులు చేపట్టనున్నారు.
వాస్తవానికి ఏప్రిల్ 1న ప్రారంభం కావాల్సి ఉంది
కాని నేటికీ రాని గైడ్‌లైన్స్
పనుల కోసం ఎదురుచూస్తున్న వేతనదారులు
గైడ్‌లైన్స్ రాలేదు..
ఏప్రిల్ నెల కూడా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంగానే అమలు కానుంది. ఏప్రిల్ నెలకు పనిదినాల సంఖ్య 44.44 లక్షలుగా నిర్దేశించారు. వీబీజీ రామ్‌జీ పథకానికి సంబంధించిన గైడ్‌లైన్స్ ఇంకా రాలేదు.
– ఎస్. శారదా దేవి, పీడీ, డ్వామా


