చికెన్
● లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ
విజయనగరం గంటస్తంభం: ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పటికీ, అదే స్థాయిలో కాలుష్యం పెరుగుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పట్టణాలు క్రమంగా కాలుష్య ప్రభావానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రతీర ప్రాంతాల్లో స్థాపితమైన ఫార్మా కంపెనీలు స్థానికులకు ఉపాధి కల్పించడం కంటే ఎక్కువగా కాలుష్యాన్ని అందిస్తున్నాయని ఆరోపించారు. డబ్బులు కంపెనీలకు జబ్బులు ప్రజలకు అనే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైతే ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్య సమస్యలు మరింత పెరిగే అవకాశముందని.. ఇప్పటికే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జాతీయ రహదారిపై రద్దీ అధికమైందని తెలిపారు. ట్రాఫిక్, కాలుష్యం సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయనున్నట్లు చెప్పారు. అనంతరం డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ రచించిన పుస్తకాన్ని విడుదల చేశారు. సమావేశంలో లోక్‌సత్తా నాయకులు మూర్తి, నాగభాస్కరం, తదితరులు పాల్గొన్నారు.


