● ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం క్రైమ్: పోలీస్‌స్టేషన్ల పరిధిలో పని చేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శుల సేవలను క్షేత్ర స్థాయిలో వినియోగించుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఎస్‌హెచ్‌ఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యలను మహిళా సంరక్షణ కార్యదర్శుల సహకారంతో గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు పరిధిలోకి కొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తించాలని.. వారు ఏ ప్రాంతం వారు, ఎందుకు, ఎక్కడ నుంచి వచ్చిందీ తెలుసుకోవాలన్నారు. గ్రామల్లో ప్రజలకు సైబర్ మోసాలు, మహిళల రక్షణకు అండగా ఉండే చట్టాలు, రహదారి భద్రత, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, శక్తి యాప్ పట్ల అవగాహన కల్పించాలని చెప్పారు. వారంలో ఒక రోజు ఎంఎస్‌పీలతో సంబంధిత ఎస్‌హెచ్‌ఓలు సమావేశం నిర్వహించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు సమాచారం లభ్యమయ్యే విధంగా సమాచార వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు. గ్రామాలు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.


