తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు రాజాం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ అలసత్వంపై నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అంగన్‌వాడీ సిబ్బందిని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు కనీస వేతనం అమలుచేయాలని, గ్రాట్యుటీ చెల్లించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ మంజూరు చేయాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, తక్షణమే జిల్లాలో ఖాళీగా ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులు భర్తీచేయాలని, పాఠశాలల వలే అంగన్‌వాడీలకు సెలవులు ప్రకటించాలని, సరిపడా సరుకులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌తో కలిసి సీడీపీఓ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జయలక్ష్మి, రూపవతి, సెక్టార్ లీడర్లు దమయంతి, సుశీల, సుజాత, సునీత, ఈశ్వరమ్మ, వనజాక్షి, కుమారి, రాంబాబు, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు. – రాజాం


