రైల్వే గ్రూప్–డి పరీక్షలకు ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్–డి 2026 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ జిల్లాశాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ శాఖ జిల్లా అధికారి జే.జ్యోతిశ్రీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. 100 మంది అభ్యర్థులను ఎంపిక చేసి రెండునెలలపాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. అభ్యర్థుల ఎంపిక 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుందని వివరించారు. ఎంపికై న వారికి ఏప్రిల్ 8వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, 10వ తరగతి మార్కుల జాబితా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, రైల్వే గ్రూప్–డి దరఖాస్తు ప్రతులు, రెండు పాస్‌ఫొటోలు జతచేసి ఈ నెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఏపీ బీసీ స్టీడీ సర్కిల్, మున్సిపల్ కస్పా స్కూల్ సమీపం, పైడితల్లమ్మ గుడి దగ్గర, విజయనగరం కార్యాలయంలో సమర్పించవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం సెల్: 96035 57333 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


