మిట్టల్‌ ప్లాంట్‌తో లక్ష ఉద్యోగాలు బూటకం | - | Sakshi
Sakshi News home page

మిట్టల్‌ ప్లాంట్‌తో లక్ష ఉద్యోగాలు బూటకం

Mar 28 2026 7:14 AM | Updated on Mar 28 2026 7:14 AM

మిట్టల్‌ ప్లాంట్‌తో లక్ష ఉద్యోగాలు బూటకం

విశాఖ ఉక్కును బలహీనపరిచే కుట్ర

ప్రభుత్వం నిధులు కేటాయించి

బలోపేతం చేయాలి : సీపీఎం

విజయనగరం గంటస్తంభం: నక్కపల్లి వద్ద మిట్టల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న స్టీల్‌ ప్లాంట్‌ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయనే ప్రచారం పూర్తిగా అసత్యమని సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి స్టీల్‌ ఫ్లాంట్‌ నిర్మాణం విశాఖ ఉక్కు పరిశ్రమను నిర్వీర్యం చేయడానికి చేస్తున్న చర్యగా కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. 8.3 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని కూటమి ఎమ్మెల్యేలు చెప్పడం ఒట్టి బూటకం అని విమర్మించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమలో 7.2 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి జరుగుతుండగా, సుమారు 15 వేల మంది మాత్రమే పని చేస్తున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో నక్కపల్లి ప్లాంట్‌ ద్వారా లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పడం వాస్తవానికి దూరమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు అవసరమైన నిధులు, మౌలిక వసతులు కేటాయిస్తే మరిన్ని ఉద్యోగాలు సృష్టించవచ్చని సూచించారు. కానీ ప్రభుత్వాలు కావాలనే నిర్లక్ష్యం చూపుతూ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయని విమర్మించారు. అంతేకాకుండా విశాఖ ఉక్కు పరిశ్రమకు వెళ్లాల్సిన నీటిని మిట్టల్‌ ప్లాంట్‌కు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే ఐదేళ్లుగా కార్మికులు, ప్రజా సంఘాలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్తులను రూ.25వేల కోట్ల విలువతో ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు కావడం లేదని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమను బలోపేతం చేయడానికి తక్షణమే నిధులు కేటాయించాలని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు రెడ్డి శంకరరావు, టి.వి.రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement