విజయనగరం: జిల్లాలోని అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈ నెల 28 నుంచి ప్రత్యేక ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి.గోవిందరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.
పరీక్షల వివరాలు
ఈ నెల 28వ తేదీ నుంచి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని తిరుమల మెడికవర్ ఆస్పత్రిలో బ్యాచ్‌ల వారీగా ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందులో భాగంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో (గుండె సంబంధిత), కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) వంటి కీలక పరీక్షలు నిర్వహిస్తారు. అవసరమైన వారికి జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, న్యూరో, ఆర్థో, గ్యాస్ట్రో నిపుణుల ద్వారా తనిఖీలు చేయిస్తారు. వైద్య పరీక్షలకు హాజరు కావాలనుకునే జర్నలిస్టులు తమ పేరు, పని చేస్తున్న పత్రిక, అక్రిడిటేషన్ నంబరుతో పాటు, కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమాచార శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఈ నెల 28వ తేదీలోపు 9553147746 , 9441285176, 9491616264 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పేర్లు నమోదు చేసుకున్న వారు, వారికి కేటాయించిన తేదీల్లో మాత్రమే ఆస్పత్రికి హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. మీడియా మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పి.గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు.


