వంగర: మండల పరిధి మడ్డువలస గ్రానైట్ కంపెనీకి సంబంధించి మైనింగ్ అధికారులు బుధవారం దర్యాప్తు చేశారు. గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నేత బూరాడ వెంకటరావు మడ్డువలసలో అక్రమ గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయని ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు టెక్నికల్ అసిస్టెంట్లు ప్రశాంత్ కుమార్, శ్రీనివాసరావు గ్రానైట్ తవ్వకాలు చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రానైట్ క్వారీ వద్ద తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఆరా తీశారు. అక్కడ ఉన్న సిబ్బంది గ్రానైట్ వారి అనుమతులకు సంబంధించి ఎటువంటి పేపర్లు అందజేయకపోవడంతో మైనింగ్ అధికారులు పూర్తి స్థాయి వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని వెల్లడించారు. ఫిర్యాదుదారుడు బూరాడ వెంకటరావు మాట్లాడుతూ గతంలో ఇదే గ్రానైట్ క్వారీని మైనింగ్ అధికారులు సీజ్ చేసి రూ.47 కోట్లు ప్రభుత్వానికి కట్టాలని ఆదేశాన్నాయని తెలిపారు. ప్రస్తుతం కూడా ఎక్కడ క్వారీకి ఎటువంటి అనుమతులు లేవని వెంకటరావు విలేకరులు ఎదుట వెల్లడించారు.


