పూసపాటిరేగ: భోగాపురం మండలం ముంజేరు సిద్ధార్దనగర్ మురుగుకాలువ వివాదంలో తప్పు చేసిన అధికారులను కోర్టులో దోషులుగా నిలబెడతామని హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ అన్నారు. భోగాపురం మండలపరిషత్ కార్యాలయం ఎదుట 106 రోజులుగా కొనసాగుతున్న దళితుల రిలే నిరహారదీక్ష శిబిరాన్ని ఆయన శనివారం సందర్శించారు. దీక్షలో ఉన్న మహిళలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగు కాలువ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారన్నారు. అధికారుల ఇళ్ల మీదుగా మురుగునీరు విడిచిపెడితే ఊరుకుంటారా అని ప్రశ్నించారు. చిన్నసమస్యను కూడా పరిష్కరించని స్థితిలో అధికారులు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌లపై ఇప్పటికే మురుగు కాలువ వివాదంపై కోర్టు ధిక్కరణ పిటిషిన్ వేశామని, త్వరలోనే చర్యలు ఉంటాయన్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. కార్యక్రమంలో ధళిత సంఘం నాయికులు పాండ్రింకి వెంకటరమణతో పాటు జిల్లా నలుమూలలు నుండి వచ్చిన ధళిత సంఘం నాయికులు పాల్గొన్నారు.


