కార్యకర్తలు ఫుల్.. సమీక్ష నిల్
● ప్రాజెక్టుల నిర్వాసితులకు ప్యాకేజీ శూన్యం ● సమీక్షలకే పరిమితమైన ‘పూర్వోదయ’ పథకం
విజయనగరం అర్బన్: రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో ఇరిగేషన్ ప్రాజెక్టులు, సాగునీటి వనరులపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశం కార్యకర్తలు ఫుల్.. సమీక్ష నిల్ అన్నరీతిలో సాగింది. అధికారుల సమక్షంలో సాగాల్సిన సమీక్ష సమావేశం.. హాల్‌నిండా నిల్చొన్న టీడీపీ కార్యకర్తల సమక్షంలో తూతూమంత్రంగా సాగించడంపై జిల్లా ప్రజలు ఆక్షేపించారు. వాస్తవంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఆమె రాకపోవడంతో జిల్లా మంత్రి చేపట్టారు. పూర్వోదయ పథకం పేరుతో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినా ఏ ప్రాజెక్టు పని ముందుకు సాగలేదు. రూ.13 వందల కోట్లతో జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులను పూర్తిచేస్తామని ప్రకటించిన మంత్రి శ్రీనివాస్.. తోటపల్లి, తారకరామ తీర్థసాగర్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, గడిగెడ్డ–చంపావతి అనుసంధాన పనులు ఏ దశలో ఉన్నాయన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ పీవీవీ సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు) మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నిర్వాసితులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ అందజేయాలని కోరారు. వారసత్వంగా వస్తున్న 15 ఎకరాల భూములకు డాక్యుమెంట్లు లేవనే సాకుతో కనీసం రెవెన్యూ అధికారులను సంప్రదించకుండా వారికి అందజేయాల్సిన సుమారు రూ.2.40 కోట్లును కోర్టుకు అప్పగించడం దారుణమన్నారు. నిర్వాసిత గ్రామాల ప్రజలు ఉపాధిహామీ పనులకు దూరమయ్యారన్నారు. సారిపల్లి నుంచి నెల్లిమర్ల రూట్‌ను రద్దుచేశారని, ప్రత్నామ్యాయ రోడ్డు చూపించాలని కోరారు. దీనిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి స్పందిస్తూ సంబంధిత రైతులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
కోర్టుకు అప్పగించిన డబ్బులు రైతులకు అందేలా చూస్తామని, ఉపాధిహామీ పనుల కల్పనకు కృషిచేస్తామని చెప్పారు. సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ డాక్టర సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు కళావెంకటరావు, కోళ్ల లలిత కుమారి, అతిది గజపతిరాజు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ పాల్గొన్నారు.


