ఆండ్ర పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

ఆండ్ర పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

Nov 11 2025 5:21 AM | Updated on Nov 11 2025 5:21 AM

ఆండ్ర

ఆండ్ర పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

మెంటాడ: ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆండ్ర పోలీస్‌స్టేషన్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఆవరణంలో ఉన్న వాహనాలు, ఆవరణ పరిసరాలు, కేసు రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టాఫ్‌, మహిళా పోలీసులతో మాట్లాడుతూ ఈ స్టేషన్‌ పరిధిలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉన్నాయని, ఆయా గ్రామాల ప్రజల్లో గంజాయి, చిల్లంగి, మత్తుపదార్థాలు, సైబర్‌క్రైమ్‌, గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌, డిజిటల్‌ అరెస్టు వంటి వాటిపై అవగాహన కల్పించాలన సూచించారు. ఆయనవెంట బొబ్బిలి డీఎస్పీ జి భవ్యారెడ్డి, గజపతినగరం సీఐ జీఏవీ రమణ ఎస్సై కె సీతారాం, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

అదృశ్యమైన బాలికను పట్టుకుంటాం

బొబ్బిలి: అదృశ్యమైన బాలిక ఆచూకీ కనుగొని అప్పగిస్తామని పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ వంగల రెడ్డి మనీషా అన్నారు. ఈ మేరకు బొబ్బిలి పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో నివసిస్తున్న బలిజిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి కుమార్తె ఈనెల 5న అదృశ్యం కావడంతో కేసును స్వగ్రామం బలిజిపేటకు బదిలీ చేశారు. దీంతో ఆ జిల్లాకు చెందిన ఏఎస్పీ మనీషా తన సిబ్బందితో పట్టణంలో విచారణ చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా టీచర్స్‌ కాలనీలోని బాలిక ఇంటికి వచ్చి తల్లిదండ్రులు, బంధువులను విచారణ చేశారు. అదృశ్యమైన బాలిక బొబ్బిలి మండలం కోమటిపల్లిలోని వివేకానంద ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో డిప్లమో చదువుతోంది. ఈ సందర్భంగా నిత్యం ఆమె కదలికలను, కాలేజీకి వెళ్లి వచ్చే ప్రయాణ మార్గాలను, స్నేహితుల వివరాలు వంటివి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆచూకీని కనుగొనేందుకు మొత్తం 5 బృందాలను నియమించినట్లు ఏఎస్పీ చెప్పారు. ప్రస్తుతం వారు గాలింపులో ఉన్నారని, త్వరలోనే ఆచూకీ కనుగొంటామన్నారు.

రెండు భైక్‌లు ఢీకొని

ముగ్గురికి గాయాలు

జామి: ఎదురెదురుగా వస్తున్న రెండు భైక్‌లు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికుల సమచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. జామి మండలంలోని కొట్టాం గ్రామానికి చెందిన టి.సత్యనారాయణ ద్విచక్రవాహనంపై జామి వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో పద్మనాభం మండలం రవుతుపాలెం గ్రామానికి చెందిన రమేష్‌, ఎర్నాయుడులు పుణ్యగిరికి బైక్‌పై వెళ్తుండగా భీమసింగి జామి ప్రధానరహదారిలో పీతలపాలెం జంక్షన్‌ సమీపంలో రెండు భైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సత్యనారాయణ తీవ్రగాయాల పాలయ్యాడు. రమేష్‌, ఎర్నాయుడు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

సఫాయి కర్మచారి యువతకు రుణాలు పొందే అవకాశం

పార్వతీపురంటౌన్‌: జిల్లాలో సఫాయి కర్మచారి వృత్తిలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకం కింద జిల్లాకు మూడు సెఫ్టిక్‌ ట్యాంకు క్లీనింగ్‌ వాహనాలను సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ డి. వెంకటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.31.67లక్షల విలువైన ఈ వాహనానికి ప్రభుత్వం రూ.14.16లక్షలు సబ్సిడీగా అందిస్తుందని మిగిలిన రూ.17.50 లక్షల రుణాన్ని ఆరు శాతం వడ్డీతో 72 నెలసరి వాయిదాల్లో నెలకు రూ.33,064 చెల్లించాల్సి ఉంటుందన్నారు. అర్హులైన ఐదుగురు సభ్యులు బృందంగా ఏర్పడి సఫాయి కర్మచారి ధ్రువీకరణ పత్రాలతో పాటు బృందంలో ఒకరికి హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లెసెన్స్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఈనెల 20వ తేదీలోగా విజయనగరం కంటోన్మెంట్‌లోని డా.మర్రి చెన్నారెడ్డి భవనంలో గల ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని మరిన్ని వివరాలకు ఫోన్‌ 9030014742, 9642460838 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఆండ్ర పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ1
1/1

ఆండ్ర పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement