రసరమ్యం.. నాటకం
● మనసును హత్తుకునేలా నాటిక ప్రదర్శనలు
● ముగిసిన రాష్ట్రస్థాయి ఆహ్వాన
నాటిక పోటీలు
విజయనగరం టౌన్: ఏపీ సృజనాత్మకత, సంస్కృతి సమితి అభినయ నాటకశాల, నటరత్న నాటక పరిషత్ సంయుక్త నిర్వహణలో గురజాడ కళాభారతి వేదికగా మూడురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు శనివారంతో ముగిశాయి. సంస్థ అధ్యక్షుడు అభినయ శ్రీనివాస్, కార్యదర్శి గెద్దవరప్రసాద్ పోటీలను పర్యవేక్షించారు. చివరిరోజు కరీంనగర్ చైతన్యకళాభారతి సభ్యులు ప్రదర్శించిన ‘స్వప్నం రాల్చిన అమృతం’ సాంఘిక నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. పి.ఎస్.నారాయణ మూలకథ, పరమాత్ముని శివరాం రచనలో మంచాల రమేష్ దర్శకత్వ ప్రతిభను చూపించారు. ఒక కాకికి దెబ్బతగిలి కిందపడిపోతే అన్ని కాకులు చుట్టూ చేరి అరుస్తాయి. వాటి మధ్య ఏ సంబంధాలు లేకపోయినా సాటి కాకులుగా గొప్పసానుభూతిని చూపిస్తాయి. భార్యాభర్తల బంధానికి, అనుబంధానికి విలువనిచ్చే మనుషులం.. కాకుల్లో ఉన్న కనీస జ్ఞానం మనలో లేకపోతే ఎలా..? అన్న అంశాన్ని నటీనటులు తమ ప్రదర్శనతో చూపరులను ఆలోచింపజేశారు. హైదరాబాద్ గోవాడ క్రియేషన్స్ ఆధ్వర్యంలో డాక్టర్ వెంకట్ దర్శకత్వంలో ‘అమ్మచెక్కిన బొమ్మ’ చూపరులను కట్టిపడేసింది. పురాణకా లం నుంచి నేటివరకూ మానవ జాతిలో దాదాపు 20 రకాల శరీరతత్వాలు కలిగిన మనుషులున్నారు. విభిన్న శరీరతత్వ స్వభావం కలిగిన వారి గురించి పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు పరిచయం చేస్తూనే వచ్చాయి. కానీ చందమామపై నివాసాన్ని ఏర్పరచుకునే సాంకేతికత గల నేటి ఆధునిక సమా జంలో ఇంకా అటువంటి వారికి సముచిత స్థానాన్ని ఇవ్వకపోవడం విచారకరం. సీ్త్ర లేదా పురుషుడు కాని వారిని అవమానించడం, గౌరవించక పోవడం, అసహ్యించుకోవడమనేది మానవజాతి దిగజారుడు స్థితికి ఓ ప్రతీకని, వాళ్లూ మనుషులేనన్న జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిదని తన రచన ద్వారా జ్యోతిరాజ్ భీశెట్టి డాక్టర్ వెంకట్ దర్శకత్వంలో నటీనటులు కళ్లకు కట్టినట్లు చూపించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులందుకున్నారు. అనంతరం బొబ్బిలి నటసమాఖ్య అధ్యక్షుడు కర్రి సత్యనారాయణకు నటరత్న ఎన్‌టీఆర్ రంగస్థల పురస్కారాన్ని అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రాజకీయ నాయకులు దాడి వీరభద్రరావు, భీశెట్టిబాబ్జి, కర్రి సత్యనారాయణ, అబ్బులు పాల్గొన్నారు.


