ఎకరాకు 28 బస్తాలు..!
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో వరి పంట దిగుబడిని అంచనా వేసేందుకు వ్యవసాయశాఖ అధికారులు పంట కోత ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు మినహా.. మిగిలిన చోట్ల దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 1.17 లక్షల హెక్టార్లలో వరి పంట సాగైంది. 2,046 పంట కోత ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు నాలుగు పంట కోత ప్రయోగాలు నిర్వహించారు. ఎకరాకు 28 నుంచి 30 బస్తాల చొప్పున జిల్లాలో 5.50 లక్షల నుంచి 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో సంతకవిటి, రేగిడి ఆమదాలవలస, వంగర, గజపతినగరం, బొండపల్లి మండలాల్లో కోతలు ప్రారంభమయ్యాయి. మిగిలిన మండలాల్లో వారం, 10 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మొక్కజొన్న పంట కోత ప్రయోగాలు: 240
జిల్లాలో మొక్కజొన్న పంట 24 వేల ఎకరాల్లో సాగైంది. 240 పంట కోత ప్రయోగాలు చేశారు. మొక్కజొన్న పంట హెక్టారుకు 6 వేల కేజీల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
ప్రారంభమైన వరి పంట కోత
ప్రయోగాలు
పంటకోత ప్రయోగాల లక్ష్యం 2,046
ఎకరాకు 28 నుంచి 30 బస్తాల వరకు వస్తుందని అంచనా
ధాన్యం దిగుబడి 5.50 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం
వరి సాగు 1.17 లక్షల హెక్టార్లు
ధాన్యం దిగుబడి లెక్కిస్తున్నాం
ధాన్యం దిగుబడి లెక్కింపునకు పంట కోత ప్రయోగాలు చేపడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా వరి పంటకు సంబంధించి 2,046 పంట కోత ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ధాన్యం దిగుబడి 5.50 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది.
– వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి
ఎకరాకు 28 బస్తాలు..!


