తిప్పికొడదాం
విజయనగరం: ఎన్నికలకు ముందు మోసకారి హామీలిచ్చి... అధికారంలోకి వచ్చాక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. కూటమి నేతల కుట్రపూరిత పాలనను తిప్పికొడదామని జెడ్పీ చైర్మన్, వైస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఈ నెల 12న తలపెట్టిన ప్రజాఉద్యమం వాల్‌పోస్టర్లను ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో పార్టీ నాయకులతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. ఓ వైపు ప్రజలందరికీ ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు పూనుకోవడం, మరోవైపు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసి పేదప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం దారుణమ న్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడి ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
12న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12న జిల్లాలోని ఏడు శాసన సభ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడతామని మజ్జి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నెల 4న నిర్వహంచతలపెట్టిన ర్యాలీలు మోంథాతుఫాన్ కారణంగా వాయిదా వేసినట్టు గుర్తుచేశారు. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో చేపట్టే ర్యాలీల్లో రాజకీయ పక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాలు, ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీల్లో భాగంగా రెవెన్యూ అధికారులకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వినతిపత్రాలు అందజేయాలని సూచించారు.
కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభిస్తోందని జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. ఒక్కో నియోజకవర్గంలో 50 వేల నుంచి 60వేల సంతకాలు సేకరించాలని నిర్ణయించగా... లక్షకుపైగా సంతకాల సేకరణ జరుగుతోందన్నారు. ఇది కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ వైద్యరంగాన్ని చంద్రబాబు ఆధ్వర్యంలోని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలిపారు. గడిచిన నెల రోజులుగా ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయినా నెట్‌వర్క్ ఆస్పత్రులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా పాలన చేతకాక ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయాలని చూడడం హాస్యాస్పదమన్నారు. డయాలసిస్ రోగులు రోజుకు రూ.10వేలు చెల్లించి వైద్యం చేయించుకునే దుస్థితి నెలకొందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, ఇప్పిలి అనంత్, శంబంగి వేణుగోపాలనాయుడు, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి రేగాన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.


