నేటి నుంచి రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు
విజయనగరం: రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు విజయనగరం అతిథ్యమివ్వనుంది. ఈనెల 24,25 తేదీల్లో నగరంలోని రాజీవ్ స్టేడియంలో 42వ రాష్ట్రస్థాయి జూనియర్స్, 8వ క్యాడెట్ తైక్వాండో చాంపియన్‌షిప్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా టోర్నీ నిర్వాహకులు డీవీ చారిప్రసాద్, సుంకరి సతీష్, కలగర్ల రాంబాబు, బుగత శ్రీనివాసరావులు పోటీలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను గురువారం స్టేడియం ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా తైక్వాండో అసోసియేన్ అధ్యక్షుడు డీవీ చారిప్రసాద్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు నిర్వహించే పోటీలను 24వ తేదీ సాయంత్రం ప్రారంభించనున్నామన్నారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 250 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పోటీలకు హజరయ్యే క్రీడాకారులకు అవసరమైన భోజన, వసతి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు 25వ తేదీ సాయంత్రం బహుమతులు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా టోర్నీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
హాజరుకానున్న 250 మందిక్రీడాకారులు


