మంత్రివర్యా.. మద్యం గోలేంటి..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఏమీ తోచని పెద్దమ్మ తోడికోడలు పుట్టింటికి చుట్టరికానికి వెళ్లిందట.. అలా తయారైంది మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిస్థితి. తనశాఖలో ఏం జరుగుతోంది.. ఎంతమేరకు ప్రగతి సాధించాం.. ఏమై నా జిల్లాకు ఉపయోగపడ్డామా? లేదా?.. యువతకు ఉపాధి చూపగలిగామా? లేదా? అనే అంశాలు కంటే దండగమారి పనులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని సొంత పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. తాగితే అనారోగ్యం పాలయ్యే మద్యం నాణ్యత పరిశీలనపై మంత్రి శ్రద్ధచూపుతుండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎరువులు దొరకక రైతులు, జ్వరాలు, పచ్చకామెర్లతో విద్యార్థులు ఆస్పత్రులు పాలవుతుంటే పట్టించుకోని మంత్రి... మద్యం దుకాణాలకు వెళ్లి.. సురక్ష యాప్‌లో స్కాన్‌చేసి నాణ్యత పరిశీలిస్తుండడాన్ని చూసి జిల్లా ప్రజలు, మేధావి వర్గం ముక్కున వేలేసుకుంటున్నారు.
నెలన్నర కిందటి వరకు యూరియా దొరక్క జిల్లా వ్యాప్తంగా రైతులు అల్లాడిపోయారు. పంట ఎదుగుదలకు అవసరమైన యూరియా కోసం రాత్రీపగలు ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరసనలు తెలిపారు. ఇలాంటి సందర్భంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎక్కడా రైతుల సమస్య గురించి ప్రస్తావించిన దాఖలా లేవు. గట్టిగా నిలబడి జిల్లా రైతులకు అవసరమైన మేరకు ఎరువులు తెప్పించే ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడు మద్యం సరఫరాపై మంత్రి మక్కువ చూపుతుండడాన్ని చూసి రైతులు ముక్కునవేలేసుకుంటున్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ ఏదీ?
పొరుగునే ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో వందలాది మంది పిల్లలు రోగాల బారిన పడ్డారు. 15 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సందర్భంలో కూడా కొండపల్లి శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఏమాత్రం తన వంతు ప్రయత్నం చేయలేదని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కనీసం మరణించిన వారి కుటుంబాల పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునే చర్యలు తీసుకోలేదు. సాధారణ ప్రజలతో ముడిపడిన ఏ అంశం పైన ఆగమేఘాలపై స్పందించని మంత్రి.. లిక్కర్ సీసాల స్కానింగ్ కోసం మాత్రం అత్యుత్సాహంతో ముందుకు రావడాన్ని ప్రజలు, మహిళలు విమర్శి స్తున్నారు. మహిళా భద్రత కోసం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన శక్తియాప్‌పై అవగాహన కల్పించేందుకు ఈ మాత్రం శ్రద్ధ చూపితే బాగుండేదని, మద్యం వ్యవహారంపై ఎందకంత మమకారం అంటూ మహిళలు ఛీదరిస్తున్నారు.
అందరిలోనూ అదే వాసన...
ఎవరి కోసం
ఈ తనిఖీలు..
రైతుల సమస్యకంటే
మద్యమే ఎక్కువా?
విజయనగరం జిల్లా నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి, వెనువెంటనే కేబినెట్లో సీటు సంపాదించిన యువ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు తన శాఖ పనితీరుపై సమీక్షించడం.. జిల్లాలో చిన్న, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడం వంటి వాటికంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నకిలీ మద్యం దందా నుంచి తెలుగుదేశం పెద్ద నాయకులను బయటపడేసేందుకే ఎక్కువ శ్రమిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు సాగునీరు, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే విషయంలో మంత్రి ఏ స్థాయి శ్రద్ధ వహిస్తున్నారో తెలియదు కానీ నాణ్యమైన మద్యం అందిస్తున్నాం అని చెప్పుకోవడానికి మాత్రం ఏకంగా లిక్కర్ బాటిళ్లను స్కాన్ చేస్తూ మందుబాబులకు భరోసాగా నిలుస్తున్నారు. గజపతినగరంలో ఓ మద్యం షాపులోకి గురువారం వెళ్లి లిక్కర్ బాటిల్ స్కాన్ చేసి మేము ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాం అన్నట్లు చెప్పకనే చెప్పుకున్నారు.
మద్యంపై ఉన్న శ్రద్ధ ఎంఎస్‌ఎం
పార్కులపై లేదా?
ఏడాదిన్నర అయినా ఎక్కడ ఒక్క పార్కుకూడా ప్రారంభంకాని వైనం
ఒక్క నిరుద్యోగికీ ఉపాధి కల్పించని పరిస్థితి
ఎరువుల కోసం రైతులు అల్లాడినా పట్టించుకోని సచివులు
రోగాలు.. గిరిజన బిడ్డల మరణాలూ కనిపించని వైనం
తాగితే అనారోగ్యంబారిన పడే మద్యం వ్యవహారంపై మక్కువెందుకంటున్న జనం


