ప్రభుత్వ వైద్యం... ప్రజల హక్కు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యం... ప్రజల హక్కు

Oct 24 2025 8:05 AM | Updated on Oct 24 2025 8:05 AM

ప్రభు

ప్రభుత్వ వైద్యం... ప్రజల హక్కు

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమంలా కోటి సంతకాల సేకరణ

28న నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం

నిరసన ర్యాలీలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతులు

పోస్టర్లు ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

విజయనగరం: ప్రభుత్వ వైద్యం.. ప్రజల హక్కని, సూపర్‌ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తే వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గమని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ నెల 28న మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం నిర్వహించనుందని, ఇందులో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని వెల్లడించారు. ఈ మేరకు సంబందిత పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి గురువారం ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్‌ ప్యాలెస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకుంటామన్నారు.

ప్రభుత్వమే మెడికల్‌ కాలేజీలను నిర్మించాలి

రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్‌ కాలేజీలను నిర్మించి, నిర్వహించాలని మజ్జి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 కాలేజీలు నిర్మించేందుకు శ్రీకారం చుట్టగా అందులో 5 కాలేజీల నిర్మాణం పూర్తిచేసి తరగతులు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. మరో 2 రెండు కాలేజీల తరగతులు ప్రారంభించారన్నారు. మిగిలిన కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేయాలన్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మిస్తే కేవలం వైద్యవిద్య మాత్రమే కాకుండా 500 పడకల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పారు.

వైద్య భరోసా కరువు

రాష్ట్రంలో వైద్యరంగం దీన స్థితికి దిగజారిపోయిందని మజ్జి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జీజీహెచ్‌లో డయాలసిస్‌ కేంద్రాన్ని సరిగా నిర్వహించక రోగులను విశాఖకు తరలించడం దారుణమన్నారు. ప్రజలకు వైద్యభరోసా కరువైందన్నారు.

వ్యవస్థలు నిర్వీర్యం

కూటమి ప్రభుత్వ తీరుతో వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని, అన్నివర్గాల ప్రజలకు అవస్థలు తప్పడంలేదని జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసరావు అన్నారు. ఆరుగాలం శ్రమించి రైతులు సాగుచేసిన పంటలకు మద్దతు ధర కరువైందన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులకు మద్దతు ధర లభించడంలేదని, క్వింటా మొక్కజొన్నలకు రూ.2,400లు రైతుకు రావాల్సి ఉండగా, దళారులకు రూ.1900కే విక్రయిస్తున్నారన్నారు. పత్తి మద్దతు ధర రూ.8,110 ప్రకటించగా... రూ.6000 వేలకే దళారులకు రైతులు అమ్ముకుంటున్న వైనం జిల్లాలోని ప్రజాప్రతినిధులకు పట్టకపోవడం దారుణమన్నారు.

● గిరిజన విద్యార్థుల మృతిపై సంబంధిత శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా చేసిన వాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గిరిజన విద్యార్ధులు చనిపోతే ఆదుకోవాల్సినది ప్రభుత్వమే అన్న సంగతి మర్చిపోవడం విచారకరమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు, మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశారు.

● ఉత్తరాంధ్రకు చెందిన కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహనాయుడు గడిచిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి చేకూర్చే ప్రయోజనం శూన్యమని మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవాచేశారు. రూ.4,500 కోట్లతో భోగాపురంలో నిర్మించతలపెట్టిన ఎయిర్‌పోర్టు పనులు 20 శాతం మేర గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని, ఇప్పుడు మూడు నెలలకొకసారి సందర్శనల పేరిట కేంద్రమంత్రి ఫొటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు కొత్తగా ఏ ప్రాజెక్టు, అభివృద్ధి పని తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కలనాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్‌, ఇప్పిలి అనంత్‌, జిల్లా ఉపాధ్యక్షులు టంకాల అచ్చెంనాయుడు, మూకల కస్తూరి, జిల్లా అధికార ప్రతినిధి కనకల రఘురామారావు, జిల్లా సోషల్‌ మీడియా విభాగం అధ్యక్షులు వాసునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యం... ప్రజల హక్కు 1
1/1

ప్రభుత్వ వైద్యం... ప్రజల హక్కు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement