ఎస్సీలకు విద్యుత్ బిల్లుల షాక్
బొబ్బిలిరూరల్: రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది. వారి ఇంటిలో ఒక బల్బు, టీవీ, ఫ్యాన్ మాత్రమే ఉన్నాయి. 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ సదుపాయం ఉండడంతో మొన్నటివరకు బిల్లులు కట్టాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు వారికి వేలల్లో బిల్లులు రావడంతో లబోదిబోమంటున్నారు. బొబ్బిలి మండలం అలజంగి గ్రామంలోని ఎస్సీ వీధిలో నివసిస్తున్న సుమారు 80 కుటుంబాలకు సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లు వేలల్లో వచ్చింది. రేజేటి శారదకు రూ.52,723, రేజేటి రమణకు రూ.56,062, యజ్జల రవికి రూ.36,000, యర్రారపు సరోజనమ్మకు 20,000 విద్యుత్ బిల్లులు రావడంతో ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించకుంటే కనెక్షన్లు తొలగిస్తామని ఆ శాఖ సిబ్బంది బెదిరిస్తున్నారని, ఉన్నతాధికారుల స్పందించి ఆదుకోవాలంటూ బాధితులు విజ్ఞప్తిచేస్తున్నారు.
పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
విజయనగరం అర్బన్: కార్తీక మాసంలో పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి గురువారం తెలిపారు. పంచారామాలుగా పేరుగాంచిన అమరావతి (అమరేశ్వరుడు), పాలకొల్లు (క్షీర రామలింగేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమరలింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను దర్శించేందుకు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఈ నెల 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు బస్సులు విజయనగరం డిపో నుంచి బయలుదేరి, మంగళవారం వేకువజామున తిరిగి విజయనగరానికి చేరుకునేలా షెడ్యూల్ రూపొందించినట్లు వివరించారు. సూపర్ లగ్జరీ బస్సుకు రూ.2 వేలు, అల్ట్రా డీలక్స్‌కు రూ.1,950 ఒక్కో టికెట్ చార్జ్‌గా ప్రకటించారు. టికెట్లు ‘ఏపీఎస్‌ఆర్‌టీసీఆన్‌లైన్.ఐఎన్’ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సమీప డిపోలలో బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
అయ్యప్ప క్షేత్రదర్శన కోసం
అయ్యప్ప భక్తుల కోసం విజయనగరం నుంచి ఏడు, 11 రోజుల యాత్రల షెడ్యూల్‌లను ప్రకటించారు. ఏడు రోజుల ట్రిప్‌లో విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవానీ, ఫలని, గురువాయూరు, ఎరుమేలి, సన్నిదానం, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, ద్వారపూడి, అన్నవరం, సింహాచలంలోని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. 11 రోజుల యాత్రలో విజయవాడ, శ్రీశైలం, మహానంది, కాణిపాకం, శ్రీపురం, భవాణి, ఫలని, గురువాయూరు, ఎరుమేలి, సన్నిదానం, త్రివేండ్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, శ్రీరంగం, కంచి, తిరుపతి, శ్రీకాళహస్తి, రాజమండ్రి, ద్వారపూడి, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
కార్తీకమాసం పిక్నిక్ స్పెషల్ బస్సులు
విజయనగరం నుంచి ప్రయాణీకుల దర్శిని, అరుకుదర్శిని, పుణ్యగిరి, లంబసింగి, అరసవిల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, టెక్కలి రావివలన తదితర క్షేత్రాలకు, భక్తుల కోరిక మేరకు ప్రయాణికులు కోరుకున్న స్థలాలకు పిక్నిక్ కోసం బస్సులు అద్దె ప్రాతిపదికన ఇస్తారు. బస్సులు బుక్ చేయడం కోసం డిపో మేనేజర్ 99592 25620, అసిస్టెంట్ మేనేజర్ విజయనగరం 73829 24103, బుకింగ్ సూపర్‌వైజర్ 73829 23683లను సంప్రదించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి కోరారు.
ఎస్సీలకు విద్యుత్ బిల్లుల షాక్
ఎస్సీలకు విద్యుత్ బిల్లుల షాక్
ఎస్సీలకు విద్యుత్ బిల్లుల షాక్


