రేషన్ సరుకులు అందేనా?
విజయనగరం ఫోర్ట్:
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలకు అందించే రేషన్ బియ్యం పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు ఒకటో తేదీన లబ్ధిదారులకు అందుతాయోలేదోనన్న మీమాంస నెలకుంది. రేషన్ షాపుల్లో కందిపప్పు పంపిణీని కొన్ని నెలలుగా కూటమి సర్కారు నిలిపివేసింది. ఇప్పుడు బియ్యం, పంచదార పంపిణీపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి బియ్యం, పంచదారను రేషన్ షాపులకు సరఫరా చేసే స్టేజ్–2 కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకు పోవడంతో వారు సరఫరాను నిలిపివేశారు. దీంతో రేషన్ షాపులకు ఇప్పటివరకు ఒక్క కిలో సరుకులు కూడా సరఫరా కాని పరిస్థితి.
లబ్ధిదారులు, సరఫరా ఇలా...
జిల్లాలో 5,71,801 రైస్ కార్డుదారులు ఉన్నారు. వీరికి నవంబర్ నెలకు బియ్యం కేటాయింపు 8587.730 మెట్రిక్ టన్నులు, పంచదార 304 మెట్రిక్ టన్నులు కేటాయించారు. జిల్లాలోని 11 ఎంఎల్‌ఎస్ పాయింట్లకు ప్రతినెలా 1– 15వ తేదీ మధ్యన, అక్కడ నుంచి 17–30వ తేదీ మధ్య జిల్లాలోని 1249 రేషన్ దుకాణాలకు సరుకుల పంపిణీ జరుగుతుంది. నవంబర్ నెల సరుకుల కోసం రేషన్ దుకాణాలకు అలాంట్ మెంట్ ఆర్డర్‌ను అధికారులు జారీచేశారు. అయితే, రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి స్టేజ్–2 కాంట్రాక్టర్లు రేషన్ డిపోలకు సరుకులు చేర్చేందుకు నిరాకరిస్తున్నారు.
సమస్య ఉంది
ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డిపోలకు బియ్యం సరఫరా చేసేందుకు స్టేజ్–2 కాంట్రాక్టర్లు నిరాకరిస్తున్నారు. ఇంకా బియ్యం సరఫరా ప్రారంభం కాలేదు. వారితో మాట్లాడుతున్నాం. సమస్య పరిష్కారం అయిన వెంటనే రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– జి.మురళీనాథ్,
జిల్లా పౌరసరఫరా అధికారి
ఇప్పటికీ రేషన్ షాపులకు చేరని సరుకులు
స్టేజ్–2 కాంట్రాక్టర్లకు బకాయిలు పేరుకుపోవడంతో సరఫరా
నిలిపివేసిన వైనం
జిల్లాలో ఎంఎల్‌ఎస్ పాయింట్లు:11
రైస్ కార్డులు: 5,71,801
బియ్యం కేటాయింపు
8587.730 మెట్రిక్ టన్నులు
పంచదార 304 మెట్రిక్ టన్నులు


