కదం తొక్కిన విద్యార్థులు
ఫీజురీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు కదం తొక్కారు. విజయనగరం తోటపాలెం నుంచి మయూరి కూడలి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కాంప్లెక్స్ వద్ద బైఠాయించి కూటమి ప్రభుత్వంపై నిరసన తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవితే లక్ష్యమంటూ ఎన్నికల ముందు తీపిమాటలు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోవడం మానేశారన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.6,800 కోట్లు ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు ‘బాబూ’ అంటూ ప్రశ్నించారు. నవంబర్ 1వ తేదీ నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, ఫీజులు పెండింగ్‌లో ఉండడంతో హాల్ టికెట్లు ఇవ్వని దయనీయ పరిస్థితి నెలకొందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.రాము వాపోయారు. ప్రభుత్వం తీరుమారకుంటే తల్లిదండ్రులతో కలిసి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్మి జె.రవికుమార్, మండలాధ్యక్షుడు జి.సూరిబాబు, కార్యదర్మి రాజు, జిల్లా కమిటీ సభ్యులు జయ, యర్రమ్మ, నాయకులు గుణ, శివ, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం
కదం తొక్కిన విద్యార్థులు


