నాగన్నా.. మీరైనా చెప్పండన్నా...
సాక్షి, పార్వతీపురం మన్యం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తున్న ఉపాధ్యాయులంతా ప్రభుత్వం నిర్వహించే డీఎస్సీలో ఉత్తీర్ణులై ఉద్యోగం సంపాదించిన వారే. వారికి ఇప్పుడు మరలా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనడంపై ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి. ఇది ఎంత వరకు సబబని ప్రశ్నిస్తున్నాయి. టెట్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దానిపై రివ్యూ పిటిషన్ వేయాలని.. తద్వారా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. టీచర్ల ఆందోళనను ప్రభుత్వం సానుకూలంగా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శనివారం నాగులచవితి కావడంతో ఇదే విషయమై పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అమరపు సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి మరిచర్ల ధనుంజయనాయుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సీర గంగునాయుడు తదితరులు పార్వతీపురంలో వినూత్నంగా నిరసన తెలిపారు. పుట్ట వద్దకు వెళ్లి.. ‘నాగేంద్రా.. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించేటట్లు చేయండ’ని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఉపాధ్యాయుడూ ఉద్యోగం కోసం డీఎస్సీ పరీక్ష రాసి, ఉత్తమ ఫలితాలు సాధించి, ఎంపికై న వారేనని గుర్తు చేశారు. ఎంతోమంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దారని.. అటువంటి గురువులకు మరలా ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాయాలనడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు మంచి ఆలోచన వచ్చేటట్లు చేయాలని నాగన్న పుట్ట వద్ద పూజలు చేశారు.
నిబంధనలను సవరించకుంటే ఉద్యమం
టెట్‌పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ వేయాలి. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి విద్యాహక్కు చట్టంలోని నిబంధనలను సవరించి, పార్లమెంట్‌లో చట్టం చేయాలి. లేనియెడల ఉపాధ్యాయ లోకమంతా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది.
– ఎస్.మురళీమోహనరావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
‘టెట్’పై ఉపాధ్యాయ వర్గాల
ఆందోళన
సర్వీసులో ఉన్న
టీచర్లకు
మినహాయించాలని డిమాండ్
నాగన్నా.. మీరైనా చెప్పండన్నా...


