ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థుల మృతి
● మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కళావతి
సీతంపేట: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థినులు మృతి చెందుతున్నారని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆరోపించారు. హడ్డుబంగి బాలికల ఆశ్రమపాఠశాల విద్యార్థిని ఎం.కవిత మృతిచెందడంతో కుటుంబ సభ్యులను శనివారం రాత్రి డొంబంగివలస వెళ్లి పరామర్శించారు. తల్లిదండ్రులు బాలకృష్ణ, చామంతిలను కుమార్తె మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అన్నివిధాల అండగా ఉంటానని, ధైర్యంతో ఉండాలని ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థినులు వరుస మరణాలు సంభవిస్తుంటే గిరిజన మంత్రిలో చలనం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరణాలు సంభవించకుండా తక్షణ కర్తవ్యం ఏంటనేది ఆలోచించాల్సింది పోయి కాలయాపన చేయడం తగదన్నారు. పాఠశాలల్లో మౌలికవసతులు కల్పించకపోవడం, హెల్త్ వలంటీర్‌లను నియమించకపోవడం వంటి కారణాలు అనేకం ఉన్నాయన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే ఆరోగ్య కార్యకర్తలను నియమిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పాఠశాలల్లో హెల్త్ చెక్‌ప్‌లు లేవన్నారు. దోమతెరలు, దుప్పట్లు వంటివి పంపిణీ చేయడం లేదన్నారు. విద్యార్థులు మరణిస్తే ఆయా కుటుంబాలకు కనీసం ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, వైఎస్సార్‌సీపీ ఎస్‌టీ సెల్ జిల్లా అధ్యక్షుడు హెచ్.మోహన్‌రావు, పార్టీనాయకులు ఎస్.సాయికుమార్, సాయికిరణ్, సుభాష్, రామయ్య, మంగయ్య, చలపతి, వెంకునాయుడు, మహేష్, చంద్రశేఖర్, బాలు, ఎర్రయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


