జాతీయస్థాయిలో విజయనగరం కళాకారుల కీర్తి
విజయనగరం గంటస్తంభం: రాష్ట్రంలోని తెనాలిలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు వీణ అవార్డుల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పౌరాణిక పంచమ పద్య నాటక పోటీల్లో విజయనగరం కళాకారులు అద్భుత విజయం సాధించారు. విజయనగరం అక్కినేని సాంస్కతిక సమాజం తరఫున దర్శకుడు గవర సత్తిబాబు బృందం ప్రదర్శించిన మోహినీ భస్మాసుర నాటకం నాలుగు విభాగాలలో బహుమతులు గెలుచుకుని, ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా నిలిచి ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ, మన జిల్లాకు చెందిన కళాకారులు జాతీయస్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమన్నారు. అదేవిధంగా శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘‘ఆదికవి నన్నయ్య భట్టు’’ నాటకం ఉత్తమ ప్రదర్శన అవార్డు సాధించడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు మాట్లాడుతూ, విజయనగరం కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారని ప్రశంసించారు. తెనాలిలో పాల్గొన్న ఇతర కళాకారులూ వారిని ప్రశంసించారు. ప్రథమ, ద్వితీయ శ్రేణి బహుమతులు రెండూ మన జిల్లాకు రావడం గర్వకారణమన్నారు. ఈ విజయోత్సవ సభలో బహుమతులు పొందిన కళాకారులు గవర సత్తిబాబు, దాసరి తిరుపతి నాయుడు, కంది త్రినాథ్, కేవీ పద్మలను అతిథులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్ కళాకారులు చల్లా రాంబాబు, ధవళ సర్వేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, పెద్దింటి అప్పారావు, రౌతు వాసుదేవరావు, అబ్బులు తదితరులు పాల్గొన్నారు.


