మొక్కల పెంపకంతో ఆరోగ్యం
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం:
మొక్కల పెంపకంతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, వాహన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గాలి పొందగలుగుతామని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి అన్నారు. ‘స్వచ్ఛమైన గాలి’ అనే అంశంతో పెద్దచెరువు గట్టున ఉన్న గాంధీ విగ్రహం వద్ద నగరపాలక సంస్థ శనివారం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందించిన పన్నెండుమంది పారిశుద్ధ్య కార్మికులను దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతిఒక్కరూ మొక్కలు విరివిగా నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలకు కాలుష్యం మీద అవగాహన కల్పించి భావితరాలు పరిశుభ్రమైన వాతావరణం అందించే దిశగా కృషిచేయాలని అన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ ద్వారా సుమారు యాభైవేల పండ్ల మొక్కలు పంపిణీ చేయడం ఆనందదాయకమన్నారు. అనంతరం గాంధీ విగ్రహం ఆవరణలో మొక్కలు నాటారు. ‘స్వచ్ఛాంధ్ర– స్వచ్ఛ విజయనగరం’ అనే నినాదంతో ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య, జిల్లా కాలుష్యనియంత్రణాధికారి సరిత, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, మెప్మా పీడీ చిట్టిరాజు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మొక్కల పెంపకంతో ఆరోగ్యం


